Begin typing your search above and press return to search.

హాలీవుడ్‌ని కాపీ కొడ‌తాన‌న్న జ‌క్క‌న్న‌

By:  Tupaki Desk   |   18 Oct 2015 1:13 PM GMT
హాలీవుడ్‌ని కాపీ కొడ‌తాన‌న్న జ‌క్క‌న్న‌
X
నేరుగా దూసుకొచ్చే బుల్లెట్ లాంటి మాట‌లు మాట్లాడ‌టం క‌ష్టం కాక‌పోవ‌చ్చు. కానీ.. నిజాన్నినిజంగా చెప్పాలంటే మాత్రం చాలా ద‌మ్ము.. చాలా చాలా ధైర్యం కావాలి. కానీ.. అలాంటివి త‌న ద‌గ్గ‌ర ట‌న్నులు.. ట‌న్నుల కొద్దీ ఉన్నాయ‌న్న విష‌యాన్ని తాజాగా స్టార్‌డైరెక్ట‌ర్ రాజ‌మౌళి స్ప‌ష్టం చేశారు. హాలీవుడ్ నుంచి కొన్ని స‌న్నివేశాల్ని తాను కాపీ చేస్తాన‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు. సూటిగా..స్ప‌ష్టంగా తాను హాలీవుడ్ చిత్రాల్ని కాపీ కొడ‌తాన‌ని ఓపెన్ గా ఒప్పుకోవ‌ట‌మే కాదు.. మీలో చాలామందికి ఆ విష‌యం తెలుసు క‌దా అంటూ ఎదురు ప్ర‌శ్న వేయ‌టంతో.. ఈల‌లు.. విజిల్స్ తో ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లిపోయిన ప‌రిస్థితి.

ఐఐటీ మ‌ద్రాస్ విద్యార్థుల‌తో రాజ‌మౌళి ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. దీనికి వంద‌లాది మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి విద్యార్థి ఒక‌రు రాజ‌మౌళిని ఒక ప్ర‌శ్న వేశారు. హాలీవుడ్ చిత్రాల నుంచి మీరెంత స్ఫూర్తి పొందుతార‌ని విన‌యంగా ప్ర‌శ్నించారు. దీనికి బ‌దులిచ్చిన రాజ‌మౌళి.. నిజానికి స‌ద‌రు విద్యార్థి చాలా మ‌ర్యాద‌గా త‌న‌ను ప్ర‌శ్న వేశాడ‌ని..కానీ వాస్త‌వానికి అత‌డు వేయాల‌నుకున్న‌ప్ర‌శ్న ఏమిటంటే.. హాలీవుడ్ సినిమాల్ని కాపీ చేస్తారా? అని మాత్ర‌మే అని వ్యాఖ్యానించారు. దీనికి స‌మాధానం చెబుతూ.. తాను హాలీవుడ్ నుంచి కాపీ చేస్తాన‌ని కానీ..స‌మ‌కాలీన చిత్రాల్లోని స‌న్నివేశాల్ని కాపీ చేయ‌న‌ని చెప్పేశారు. ఇంత‌టి సూటి స‌మాధానాన్ని ఎవ‌రూ ఊహించ‌లేదేమో కానీ.. ఒక్క‌సారిగా రాజ‌మౌళి మాట‌ల‌కు ఐఐటీ విద్యార్థుల చ‌ప్ప‌ట్ల‌తో హాలు ద‌ద్ద‌రిల్లేలా చేశారు.

తాను అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ గా ఉన్న‌ప్పుడు ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువ‌గా చూసేవాడిన‌ని.. చాలామంది ఆ ప‌ని చేసేవారు కాద‌ని.. ఏదైనా క‌థా చ‌ర్చ‌ల్లో పాల్గొన్న సంద‌ర్భంలో ఏదైనా సీన్ చెప్పాల‌నుకున్న‌ప్పుడు తాను చూసిన హాలీవుడ్ సినిమాలోని స‌న్నివేశాన్ని చెబితే.. తానుచాలా బాగా ఆలోచిస్తాన‌ని.. క్రియేటివిటీ ఎక్కువ‌గా భావించేవార‌ని చెప్పుకొచ్చారు. కాపీ చేయ‌టాన్ని తాను త‌ప్పుగా భావించ‌లేద‌న్న రాజ‌మౌళి.. అర్ట్ అన్న‌ది కాపీ కానేకాద‌ని.. మాతృక‌కు త‌న సృజ‌నాత్మ‌క‌త‌ను జోడించ‌టం త‌ప్పేం కాద‌ని త‌న వాద‌న‌ను స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నంచేశారు. ఏమైనా తిరుగులేని ద‌ర్శ‌కుడిగా పేరున్న ఒక వ్య‌క్తి ఇంత నిర్మోహ‌మాటంగా స‌మాధానం చెప్ప‌టం గ్రేట్ క‌దూ.