Begin typing your search above and press return to search.

'ఆర్ ఆర్ ఆర్'లోని పవర్ఫుల్ డైలాగ్ చెప్పిన రాజమౌళి!

By:  Tupaki Desk   |   9 Nov 2021 4:48 AM GMT
ఆర్ ఆర్ ఆర్లోని పవర్ఫుల్ డైలాగ్ చెప్పిన రాజమౌళి!
X
తెలుగు సినిమాకు భారీతనాన్ని తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి. తెలుగు కథను ప్రపంచపటానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. బలమైన కథకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తే తెరపై ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చనేది నిరూపించిన దర్శకుడు రాజమౌళి. ఆయన సిద్ధం చేసుకునే కథలపై .. ఆయన ఆవిష్కరించే తీరుపై ప్రేక్షకులకు ఉన్న నమ్మ కం అంతా ఇంతా కాదు. ఆయన సినిమాకి సంబంధించిన అప్ డేట్ కోసం ఎంతోమంది ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు.

ఒక కథపై కసరత్తు చేయడానికి .. ఆ కథకు ఒక పూర్తి రూపాన్ని తీసుకుని రావడానికి .. పాత్రలను వైవిధ్యభరితంగా మలచడానికి .. తాను చెప్పదలచుకున్న విషయాన్ని పవర్ఫుల్ గా చెప్పడానికి రాజమౌళి చాలా సమయమే తీసుకుంటారు. అయినా ఆయన సినిమా కోసం ఎంతమాత్రం తగ్గని ఉత్సాహంతోనే ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. అయితే రాజమౌళి ఎప్పుడూ కూడా తన సినిమాల విడుదలకు ముందు ఆ సినిమాల గురించి గొప్పగా ఎక్కడా ఏమీ చెప్పరు. టీజర్ .. ట్రైలర్ లాంటివి వదులుతూ అంచనాలు పెంచుతారే తప్ప, ఏ స్టేజ్ పై కూడా ఆయన తాను చేస్తున్న సినిమా గురించి ఎక్కువగా మాట్లాడరు.

టీజర్ .. ట్రైలర్ వంటి వాటిని కూడా సాధ్యమైనంతవరకూ విజువల్స్ పైనే లాగిస్తారు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని విజువల్స్ ద్వారానే చెప్పేస్తారు తప్ప .. డైలాగ్స్ ఉండవు. అలాంటి రాజమౌళి రీసెంట్ గా కపిల్ దేవ్ వచ్చిన ఒక ఛారిటీ ఈవెంట్ కి హాజరయ్యారు. ఆ వేదికపై ఆయన మాట్లాడుతూ సందర్భాన్ని బట్టి 'ఆర్ ఆర్ ఆర్'లోని ఒక డైలాగ్ ను చెప్పారు. "యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి .. అది ధర్మయుద్ధమైతే" అనేదే ఆ డైలాగ్. రాజమౌళి చాలా సాధారణంగా ఈ డైలాగ్ చెప్పినప్పటికీ ఇది చాలా పవర్ఫుల్ డైలాగ్ .. డెప్త్ ఉన్న డైలాగ్ అనే విషయం అర్థమవుతూనే ఉంది.

'ఆర్ ఆర్ ఆర్' దేశభక్తి నేపథ్యంలో .. అల్లూరి - కొమరం భీమ్ వంటి పోరాటయోధుల చుట్టూ తిరిగే కథ. ఆత్మవిశ్వాసంతో ఆంగ్లేయులను ఎదిరించే కథ. అందువలన రాజమౌళి చెప్పిన డైలాగ్ ఈ కథకు కరెక్టుగా సరిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎన్టీఆర్ - చరణ్ లలో తెరపై ఎవరు ఈ డైలాగ్ చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ లో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలనున్నారు. ఆ ట్రైలర్ లో నైనా ఈ విషయాన్ని రివీల్ చేస్తారేమో చూడాలి. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.