Begin typing your search above and press return to search.

ప్రభాసూ నువ్వు పెద్ద షిప్పులాంటోడివి: రాజమౌళి

By:  Tupaki Desk   |   10 March 2022 4:34 PM GMT
ప్రభాసూ నువ్వు పెద్ద షిప్పులాంటోడివి: రాజమౌళి
X
పెద్ద సినిమాలకు ఇప్పుడు ప్రభాస్ అండ. ఆయన నుంచి వచ్చే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు పండగ. అందువలన అంతా కూడా ఆయన తాజా చిత్రమైన 'రాధేశ్యామ్' కోసం ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. రేపే ఈ సినిమా రిలీజ్ కావడంతో ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా 'రాధే శ్యామ్' గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా తన రికార్డుల వేటను ఎక్కడి నుంచి మొదలుపెడుతుందనే విషయంపై అప్పుడే చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ప్రభాస్ ను రాజమౌళితో ఇంటర్వ్యూ చేయించారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగసందడి చేస్తోంది. ప్రభాస్ తనని తాను తగ్గించుకుని రాజమౌళి దగ్గర చనువు ప్రదర్శించడం, ఆయన స్థానాన్ని అలాగే ఉంచుతూ ప్రేమాభిమానాలతో రాజమౌళి మాట్లాడిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 'ఆర్ ఆర్ ఆర్' వంటి సినిమాలో ప్రభాస్ గెస్టుగా కనిపిస్తే ఎలా ఉంటుందని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ప్రభాస్ రేంజ్ ఏమిటనేది అందరికీ తెలుసును కాబట్టి.

కానీ ప్రభాస్ మాత్రం ఆ సినిమాలో తనకి గెస్టు రోల్ అయినా ఇచ్చి ఉండొచ్చు కదా? అని అడగడం రాజమౌళిపై .. ఆయన సినిమాలపై ప్రభాస్ కి గల నమ్మకానికి అద్దం పడుతుంది.

ఈ విషయం గురించిన ప్రస్తావనలోకి ప్రభాస్ వెళుతూ .. " సార్ .. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను తీసేటప్పుడు నేను మీకు గుర్తుకు రాలేదా? ఆ సినిమా చేస్తున్నప్పుడు మీ విజన్ లో నేను అసలు కనిపించనే లేదా? కనీసం నాకు ఒక గెస్టు రోల్ ఇచ్చి ఉండాల్సింది కదా? ఎన్టీఆర్ - చరణ్ లతో కలిసి నేను స్క్రీన్ పై కనిపిస్తే ఎంత బాగుండేది. మీరు తలచుకుంటే నా కోసం ఆ సినిమాలో ఒక పాత్రను క్రియేట్ చేయలేరా?" అని అడిగాడు.

అందుకు రాజమౌళి నవ్వుతూ .. 'బాబూ ప్రభాసూ నువ్వు పెద్ద షిప్పులాంటివాడివి. నా సినిమాలో ఒక సీన్ కి పెద్ద షిప్ అవసరమై ఉంటే తప్పకుండా నిన్ను రిక్వెస్ట్ చేసైనా ఒప్పించేవాడిని. అలా కాకుండా ప్రభాస్ నా మాట కాదనడు .. నేను చెప్పగానే చేస్తాడు అనే ఉద్దేశంతో ఇంత పెద్ద షిప్పును తీసుకుని వెళ్లి ఆ సీన్లో ఇరికించలేను" అన్నారు.

అప్పటికప్పుడు రాజమౌళి సమయస్ఫూర్తితో ఇచ్చిన సమాధానం ఎవరికైనా సరే గొప్పగా అనిపిస్తుంది. 'నా కంటే మీకు చరణ్ .. ఎన్టీఆర్ ఎక్కువ' అని సరదాగా ప్రభాస్ అంటే, 'నాతో సినిమా చేసే హీరోలతో నేను ఉండే తీరు అలాగే అనిపిస్తుంది' అని రాజమౌళి అనడం కూడా ఈ ఇంటర్వ్యూ కి హైలైట్ గా నిలిచింది.