Begin typing your search above and press return to search.

రాజమౌళి మెచ్చుకోవడమంటే మాటలా?

By:  Tupaki Desk   |   30 Dec 2021 7:30 AM GMT
రాజమౌళి మెచ్చుకోవడమంటే మాటలా?
X
మలయాళంలో తోవినో థామస్ కి మంచి క్రేజ్ ఉంది. నిన్న త్రివేండ్రంలో జరిగిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యాడు. ఆయన తాజా చిత్రమైన 'మిన్నల్ మురళీ' సినిమా ఈ నెల 24వ తేదీన నెట్ ఫ్లిక్స్ ద్వారా డైరెక్టు డిజిటల్ గా విడుదలైంది. బసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ .. ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. గ్లోబల్ టాప్ 10 .. నాన్ ఇంగ్లీష్ చిత్రాలలో ఈ సినిమా 4వ స్థానంలో నిలవడం విశేషం.

ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తోవినో థామస్ ను రాజమౌళి అభినందించారు. 'మిన్నల్ మురళీ' ఇండియాలోనే ఒక బెస్ట్ సూపర్ హీరో ఫిల్మ్ అనీ, తోవినో థామస్ తన అద్భుతమైన నటనతో ఆ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ కు గాను తోవినో థామస్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ మాట్లాడుతూ.. తోవినో థామస్ కి ఎంత క్రేజ్ ఉందనేది తమ కళ్లముందు కనిపిస్తోన్న సందడి చూస్తేనే అర్థమైపోతోందని అన్నారు. ఆయనతో స్టేజ్ ను పంచుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు.

ఇక ఈ వేదికపై రాజమౌళి .. ఎన్టీఆర్ .. చరణ్ కామన్ గా ఒక పాయింట్ చెప్పారు. గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన 'సింహాద్రి' .. 'మగధీర' రెండు సినిమాలు కూడా కేరళలో భారీస్థాయిలో విడుదలయ్యాయనీ, కేరళ ప్రేక్షకులు ఈ రెండు సినిమాలకి అనూహ్యమైన విజయాన్ని అందించారని అన్నారు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేయాలని కోరారు. ఆ సినిమాల తరువాత మళ్లీ ఇంతకాలానికి కేరళ ప్రేక్షకులను కలుసుకోవడం ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. తమ అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమా తరువాత మహేశ్ బాబు ప్రాజెక్టుతో రాజమౌళి బిజీ కానున్నారు. పరశురామ్ సినిమాను పూర్తి చేసేసి రాజమౌళి ప్రాజెక్టుపైకి మహేశ్ వెళ్లనున్నాడు. ఇక ఇటీవల శంకర్ ప్రాజెక్టును ఆరంభించిన చరణ్, ఆ తరువాత మరో రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఆ సినిమాలకి సుకుమార్ .. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. ఇక ఎన్టీఆర్ ముందుగా కొరటాల శివతో సినిమాను చేసి, ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోతూనే ఉన్నాయి.