Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కీ .. చరణ్ కి మధ్య తేడా తేల్చేసిన రాజమౌళి!

By:  Tupaki Desk   |   8 Feb 2022 3:30 PM GMT
ఎన్టీఆర్ కీ .. చరణ్ కి మధ్య తేడా తేల్చేసిన రాజమౌళి!
X
సాధారణంగా ఇంచుమించు ఒకే ఇమేజ్ ఉన్న హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తారు. నిర్మాణపరమైన విషయాలతో పాటు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆ ఆలోచనను విరమించుకుంటారు. ఏ హీరోను కాస్త తక్కువగా చేసి చూపించినట్టుగా అనిపించినా, అభిమానులతో లేనిపోని గొడవ ఎందుకని అనుకుంటారు. ఈ మధ్య మల్టీ స్టారర్ లు గతంలో మాదిరిగా రాకపోవడానికి ఇదో కారణంగా కనిపిస్తోంది. అలాంటిది రాజమౌళి ఎన్టీఆర్ - చరణ్ లతో 'ఆర్ ఆర్ ఆర్' అనే సాహసం చేశారు.

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ ను .. మెగా ఫ్యామిలీ నుంచి చరణ్ ను హీరోలుగా తీసుకుని, వారి క్రేజ్ కి తగినట్టుగా పాత్రలను బ్యాలెన్స్ చేయడం అంత ఆషామాషీ విషయమేం కాదు. అందునా ఆ పాత్రలు పవర్ఫుల్ వి కావడం .. చారిత్రక నేపథ్యంతో కూడుకున్నవి కావడం మరో విశేషం. అలాంటి పాత్రలలో ఎన్టీఆర్ - చరణ్ లను చూపించడానికి రాజమౌళి పూనుకోవడం గొప్ప విషయం. ఆ పాత్రలను ఆయన ఎలా చూపించనున్నాడనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల్లో చర్చనీయాంశమైంది.

ఇక ఇంతకుముందే ఎన్టీఆర్ తో 'స్టూడెంట్ నెంబర్ 1' .. 'సింహాద్రి' .. 'యమదొంగ' సినిమాలను చేసిన రాజమౌళి, చరణ్ తో 'మగధీర' తీశారు. ఈ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అనిపించుకున్నవే. అయితే ఇద్దరితో కలిసి ఆయన చేసిన మొదటి సినిమా ఇదే. అలాంటప్పుడు ఆ ఇద్దరిలో రాజమౌళి ఏం గమనించారు? అనే ఆసక్తికరమైన ప్రశ్న చాలా మందిలో తలెత్తుతూ ఉంటుంది. ఆయా ఛానల్స్ కి ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు ఈ ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. ఆ మధ్య ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లినప్పుడు, ఈ విషయంపై రాజమౌళి స్పందించారు.

"ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరూ నాకు సమానంగానే కనిపిస్తారు. టాలెంట్ విషయంలో ఒకరు ఎక్కువ .. మరొకరు తక్కువ అని నేనే కాదు ఎవరూ చెప్పలేరు. నటనపరంగా ఇద్దరిలోను ఎలాంటి లోపాలు కనిపించవు. కానీ ఇద్దరిలో ఒక తేడా మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. చరణ్ ఒక సీన్ చేయగానే 'చాలా బాగా చేశావ్ చరణ్' అంటూ ఆయనను ఆలింగనం చేసుకుంటాను. అప్పుడు చరణ్ 'నిజంగానే బాగా చేశానా?' అంటూ వెళ్లి ఆ సీన్ ఒకసారి చూసుకుంటాడు. 'బాగానే వచ్చిందంటారా? .. మీకు ఓకే అయితే నాకు ఓకే' అంటాడు.

ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే .. తను ఏదైనా సీన్ చేయగానే, 'అదరగొట్టేశావ్' అని చెప్పాలనుకుంటాను. అందుకోసం ఆయన వైపు చూడగానే 'చింపేశాను కదూ' అంటాడు. చరణ్ దగ్గరకి వస్తే ఆయన దర్శకుడిపై పూర్తి నమ్మకం పెట్టేస్తాడు. ఎన్టీఆర్ దగ్గరికి వచ్చేసరికి తనపై తనకి ఉన్న నమ్మకం కనిపిస్తుంది. ఆ ఇద్దరిలో నేను గమనించింది ఇదే. ఇక సీన్ బాగా రావడం కోసం కష్టపడటంలోను .. కసరత్తు చేయడంలోనూ ఇద్దరూ సమానంగా కనిపిస్తారు" అని చెప్పుకొచ్చారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా మార్చి 25వ తేదీన విడుదల కానుంది.