Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' లోని మరో సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి..!

By:  Tupaki Desk   |   1 Jun 2021 1:30 PM GMT
ఆర్.ఆర్.ఆర్ లోని మరో సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి..!
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి బయటకు వస్తున్న కొత్త విషయాలు అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి. ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ రచయిత, రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర‌ప్ర‌సాద్ వెల్లడించిన సీక్రెట్ ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది.

'RRR' చిత్రంలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చరిత్రలో ఎప్పుడూ కలవని, వేర్వేరు కాలాలకు చెందిన ఇద్దరు రియల్ లైఫ్ పోరాట యోధులు.. దేశం కోసం కలసి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే వీరిద్దరూ పోరాడే క్ర‌మంలో ఒక‌రినొకరు కొట్టుకుంటారని.. అది చూస్తే ప్రేక్షకులు ఎమోషనలై కన్నీళ్లు పెట్టుకుంటారని విజయేంద్ర ప్రసాద్ చెబుతున్నారు. ఇటీవల ఆలీ హోస్ట్ చేస్తున్న టాక్ షోలో మాట్లాడిన విజయేంద్రప్రసాద్.. 'ఆర్.ఆర్.ఆర్' లో చరణ్ - తారక్ మధ్య వచ్చే ఫైట్ సీన్ ఉద్వేగానికి గురి చేస్తుందని మరోసారి వివరణ ఇచ్చారు.

''జనరల్ గా సినిమాల్లో విలన్ ను హీరో కొడుతుంటే ఇంకా కొట్టాలి నరకాలి అనుకుంటాం. కానీ అదే మంచి కోసం ఇద్దరు మంచి వాళ్ళు కొట్టుకుంటే ఎవరి పక్షాన ఉండగలం?. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటే ఏ తల్లి కూడా ఒకడు నెగ్గాలి ఒకడు ఓడిపోవాలి అని కోరుకోదు. కొట్టుకోవద్దురా అంటూ ఏడుస్తుంది. అలానే ఒకరికొకరు మంచి వాళ్ళని తెలిసిన ఇద్దరు సూపర్ స్టార్స్ పరిస్థితులు ప్రభావం వల్ల కొట్టుకుంటూ ఉంటే మనకు ఏడుపు వస్తుంది. ఫస్ట్ టైం నేను అలాంటి ఎమోషన్ ఫీల్ అయ్యాను. కథ అని తెలుసు.. అది సినిమా అని తెలుసు. అవి పాత్రలు అని తెలుసు. మళ్ళీ కలుస్తారని తెలుసు. అయినా సరే అయ్యో కొట్టుకుంటున్నారే కొట్టుకో వద్దురా అనిపించింది. ఎన్నిసార్లు చూసినా అదే అనుభూతి కలుగుతుంది'' అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. దీనిని బట్టి చూస్తే రామ్ చరణ్ - జూ.ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్ అయ్యేలా జక్కన్న డిజైన్ చేసినట్లు అర్థం అవుతోంది.