Begin typing your search above and press return to search.

నరుడా డోనరుడా.. రాజమౌళి ముద్ర

By:  Tupaki Desk   |   24 Sep 2016 11:30 AM GMT
నరుడా డోనరుడా.. రాజమౌళి ముద్ర
X
విక్కీ డోనర్.. బాలీవుడ్లో ప్రకంపనలు రేపిన సినిమా. వీర్య దానం నేపథ్యంలో ఓ సినిమా తీయడమే సంచలనమైతే.. ఈ సినిమా సాధించిన విజయం మరింతగా ప్రకంపనలు రేపింది. రూ.5 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులోకి ‘నరుడా డోనరుడా’ పేరుతో రీమేక్ చేశారు. సుమంత్ హీరో. ముందు ఈ సినిమా తెలుగులోకి వస్తోందంటే.. మనవాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. ఏమాత్రం ఆసక్తి చూపిస్తారో అని సందేహించారు కానీ.. దీని ఫస్ట్ లుక్ పోస్టర్లు చూశాక అభిప్రాయం మారింది. మంచి టైటిల్.. సరదాగా అనిపించే పోస్టర్లు సినిమా మీద పాజిటివ్ ఇంప్రెషన్ తీసుకొచ్చాయి.

ముఖ్యంగా నరుడా డోనరుడా అనే టైటిల్ ఈ సినిమా కాన్సెప్టుకు తగ్గట్లుగా భలేగా సూటవడమే కాక క్యాచీగా అనిపించింది. ఈ టైటిల్ వెనుక ఓ ఆసక్తికర కథ ఉందట. ఈ టైటిల్ ఆలోచన సుమంత్ దేనట. ఈ సినిమాకు ఏం టైటిల్ పెడదాం అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ.. ఓ రోజు స్నానం చేస్తుండగా.. ‘భైరవ ద్వీపం’లోని నరుడా ఓ నరుడా అనే పాట హమ్ చేశాడట సుమంత్. వెంటనే డోనరుడా అనే పదం తట్టిందట. ఆ తర్వాత ఈ ‘డోనరుడా’ అనే మాట గురించి తన దర్శకుడు.. ఇతర యూనిట్ సభ్యులతో చర్చించాడట సుమంత్. ఆపై ఓ ఆడియో వేడుక సందర్భంగా రాజమౌళి.. కీరవాణిలను కలిసినపుడు తాను చేస్తున్న సినిమా గురించి.. ‘నరుడా డోనరుడా’ అనే టైటిల్ గురించి చెప్పగా.. ఇద్దరూ గట్టిగా నవ్వారట. రాజమౌళి వెంటనే.. ఈ టైటిలే లాక్ చేయమని.. మరో ఆలోచన వద్దని సుమంత్ కు చెప్పాడట. జక్కన్న లాంటి వాడు ఆమోద ముద్ర వేయడంతో సుమంత్ ఆ టైటిల్ కే ఫిక్సయిపోయాడట.