Begin typing your search above and press return to search.

చైనా మార్కెట్ ఛేజిక్కితే దేశంలో మ‌న‌ల్ని కొట్టేవాడే లేడు!

By:  Tupaki Desk   |   30 May 2022 3:24 AM GMT
చైనా మార్కెట్ ఛేజిక్కితే దేశంలో మ‌న‌ల్ని కొట్టేవాడే లేడు!
X
చైనా మార్కెట్ ఛేజిక్కితే దేశంలో మ‌న‌ల్ని కొట్టేవాడే లేడు! అవునా.. ఇది నిజ‌మా? అదెట్టా అంటారా? దీనికి ప్ర‌త్యేకించి గ‌ణాంకాలను 'తుపాకి' ఎక్స్‌ క్లూజివ్‌ గా విశ్లేషిస్తోంది. భార‌త‌దేశంలో సినిమా 1000 కోట్ల క్ల‌బ్ ని మించి ఎదిగింది. అంటే 130 కోట్ల భార‌తీయుల నుంచి ప్ర‌పంచ దేశాలకు మ‌న దేశం నుంచి ఎగిరిపోయిన ఎన్నారైల నుంచి.. ఇండియ‌న్ డ‌యాస్పోరా (దేశ‌విదేశాలు) నుంచి భార‌తీయ సినిమా ఇంత పెద్ద మొత్తాన్ని కొల్ల‌గొట్ట‌గ‌లుగుతోంది. ద‌క్షిణ భార‌త‌దేశం నుంచి బాహుబ‌లి 2 - ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 ఇప్ప‌టివ‌ర‌కూ 1000 కోట్ల క్ల‌బ్ చిత్రాలుగా నిలిచాయి. అది కూడా చైనా మార్కెట్ తో ఏమాత్రం సంబంధం లేకుండా ఇది సాధ్య‌మైంది.

బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ న‌టించే సినిమాలు దేశ విదేశాల్లో అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధిస్తున్నాయి. అత‌డి సినిమాల‌కు భార‌త‌దేశంతో పాటు చైనా అత్యంత కీల‌క‌మైన మార్కెట్ గా మారింది. ఇత‌ర ఖాన్ ల‌కు లేనిది అమీర్ కి మాత్ర‌మే ఉన్న‌ది ఏమిటో చైనీయుల‌కు న‌చ్చిన‌దేమిటో అత‌డి సినిమాలే చెబుతున్నాయి. అమీర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్ - సీక్రెట్ సూప‌ర్ స్టార్ చిత్రాలు చైనాలో సంచ‌ల‌న విజ‌యం సాధించి 1000 కోట్ల క్ల‌బ్ లో చేరాయి. క్రీడా స్ఫూర్తిని ర‌గిలించే దంగ‌ల్ చైనీయుల‌కు బాగా క‌నెక్ట‌య్యింది.

ఇప్పుడు అమీర్ న‌టించిన‌ 'లాల్ సింగ్ చ‌ద్దా'కు కూడా చైనాలో క్యూరియాసిటీ నెల‌కొంది. అయితే ఈ సినిమా ఒరిజిన‌ల్ స్టోరీతో కాకుండా అమీర్ పాపుల‌ర్ హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ ని రీమేక్ చేయ‌డంతో దీనికి ఆశించినంత రేంజు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అంటే అమీర్ మునుప‌టిలాగా చైనా నుంచి 1000 కోట్ల వ‌సూళ్లను రాబ‌ట్ట‌డం అంత సులువేమీ కాదు.

అయితే ఇప్పుడు అమీర్ ఖాన్ చైనాలో మ్యాజిక్ చేయ‌క‌పోయినా ఆ స్పేస్ ని భ‌ర్తీ చేసేందుకు ఇంకెవ‌రైనా ప్ర‌య‌త్నిస్తారా? అంటే .. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ప్ర‌య‌త్నిస్తారేమో చూడాలి. అమీర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్ కి సీక్రెట్ సూప‌ర్ స్టార్ కి ఎలాంటి అంశాలు ఎంపిక చేస్తే చైనా నుంచి వెయ్యి కోట్ల క్ల‌బ్ సాధ్య‌మైందో దానిని విశ్లేషించి యూనిక్ థాట్ తో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్ర‌తిసారీ ఒకే ఫార్ములా వినోద‌రంగంలో వ‌ర్క‌వుట్ కాదు. యూనిక్ థాట్ ప్ర‌తిసారీ గెలిపిస్తుంద‌న్న‌ది విశ్లేషించాలి. నిజానికి బాహుబ‌లి ఫ్రాంఛైజీతో రాజ‌మౌళి చైనాలో విశ్వ‌ప్ర‌య‌త్నం చేసినా అది స‌ఫ‌లం కాలేదు. దానికి కార‌ణం చైనీయులకు ఈ త‌ర‌హా రాజులు రాజ్యాలు జాన‌ప‌ద చిత్రాలు కొత్తేమీ కాదు.

పైగా అక్క‌డ సెన్సిబిలిటీస్ కి సౌతిండియా రాజుల క‌థ‌లు ఎక్క‌లేదు. అలాగే విజువ‌ల్ గ్రాఫిక్స్ టెక్నాల‌జీ ప‌రంగా చైనా ఎంతో అడ్వాన్స్ డ్ సినిమాల‌ను అందిస్తోంది. గ్రాఫిక్స్ సౌండ్ టెక్నాల‌జీలో విస్మ‌య‌ప‌రిచే మ్యాజిక్ అక్క‌డ ఫిలింమేక‌ర్స్ సొంతం. మార్ష‌ల్ ఆర్ట్స్ లో అథ్లెటిక్స్ లో ప్ర‌పంచం చ‌రిత్ర‌ను తిర‌గేస్తే చైనా వెయ్యి రెట్లు పైన ఉంది. అందువ‌ల్ల చైనీయుల అభిరుచిని ట‌చ్ చేసేలా యూనిక్ కంటెంట్ ని సౌత్ ఫిలింమేక‌ర్స్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పైగా భార‌తీయ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూనే చైనా ఆడియెన్ హృద‌యాల‌ను గెల‌వాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఇది సాధ్య‌మైతే దాదాపు 150 కోట్ల జ‌నాభాతో ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్ గా ఉన్న చైనా మార్కెట్ నుంచి అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ దిశ‌గా రాజ‌మౌళి కానీ సౌత్ ట్యాలెంట్ కానీ ఆలోచించి త‌మ ప‌రిధిని విస్త‌రిస్తే అది అసాధార‌ణం అవుతుంది.

ఇక టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చైనీ వుడ్ అయినా కానీ ప్ర‌తిచోటా సినిమా మాఫియా అనేది ఉంది. దానిని ఎదురించి అక్క‌డా అంద‌రి మ‌న‌సులను గెలిచి మార్కెట్ ని గుప్పిట ప‌ట్టాల్సి ఉంటుంది. ఏటికి ఎదురీదేవాడు జ‌గ‌జ్జేత అవుతాడు! రాజ‌మౌళి- శంక‌ర్‌- క‌మ‌ల్ హాస‌న్‌- ప్ర‌శాంత్ నీల్ లాంటి ద‌ర్శ‌కులు మునుముందు దేశ స‌రిహ‌ద్దుల‌ను చెరిపేసి చైనా మార్కెట్ ని కూడా ఛేజిక్కించుకుంటారనే ఆశిద్దాం. మ‌న సౌత్ ప్ర‌భ‌ను చైనాలోనూ వెస్ట్ లోనూ విస్త‌రిస్తే విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కోరుకున్న‌ట్టు ఆస్కార్ ల‌ను మ‌న‌మే వారిని పిలిచి ఇస్తామేమో ఎవ‌రికి తెలుసు! మ‌రో హాలీవుడ్ ని భార‌త‌దేశంలోనే త‌యారు చేసిన వాళ్లం అయితే అది మ‌హ‌దాద్భుత‌మే క‌దా! (తుపాకి ఎక్స్ క్లూజివ్‌)