Begin typing your search above and press return to search.

అతను చెప్పాకే మారిపోయానంటున్న జక్కన్న

By:  Tupaki Desk   |   18 March 2017 6:22 AM GMT
అతను చెప్పాకే మారిపోయానంటున్న జక్కన్న
X
దర్శకుడి పని అంత సులువు కాదు. సెట్లో వందలమంది అతడి ఆదేశాల కోసం ఎదురు చూస్తుంటారు. ఇక సెట్ నుంచి బయటికి వచ్చాక కూడా టెక్నీషియన్స్ నుంచి ఔట్ పుట్ రాబట్టుకోవాల్సి ఉంటుంది. మామూలు సినిమా తీసినా.. ఎన్నో వందలమందిని సమన్వయం చేసుకుని అందరి నుంచి అత్యుత్తమ పనితీరును రాబట్టుకోవడం అంత సులువైన విషయం కాదు. ఇక ‘బాహుబలి’ లాంటి మెగా ప్రాజెక్టు చేసేటపుడు ఎంత కష్టం ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం. వేలమందితో పని చేయించుకోవడం.. తాను అనుకున్నట్లుగా ఔట్ పుట్ తీసుకురావడమంటే సవాలే. ఐతే ఆ సవాలును తాను ఛేదించగలగడానికి ఒక రకంగా కెమెరామన్ సెంథిల్ కుమార్ కారణం అంటున్నాడు రాజమౌళి. గతంలో ఒక సినిమా షూటింగ్ సందర్భంగా సెంథిల్ చెప్పిన మాటలు తనలో మార్పు తీసుకొచ్చాయని.. ఆ మాటలే ‘బాహుబలి’ పనిని కొంచెం తేలిక చేశాయని రాజమౌళి తెలిపాడు.

‘‘ఇంతకుముందు ఓ సినిమా షూటింగ్ సందర్భంగా యూనిట్లో వాళ్లు చురుగ్గా పని చేయట్లేదని.. నా ఆలోచనలకు తగ్గట్లుగా ఔట్ పుట్ రావట్లేదని కోపం తెచ్చుకున్నాను. అరిచేశాను. తర్వాత సెంథిల్ నా దగ్గరికి వచ్చి అది సరికాదన్నారు. దర్శకుడి నుంచే అందరూ ఎనర్జీ తీసుకుంటారని.. అలాంటిది దర్శకుడే అసహనం చెందితే యూనిట్ సభ్యులు కూడా డీమోరలైజ్ అవుతారని అన్నాడు. నేను సరిగ్గా పని చేయకపోవడం వల్లే వాళ్లు కూడా అలా చేస్తున్నారని మొహమాటం లేకుండా చెప్పాడు. ఆ సమయానికి నాకు ఆ మాటలేమీ పట్టలేదు. కానీ తర్వాత ఆలోచిస్తే నిజమే అనిపించింది. అప్పట్నుంచి నా తీరు మార్చుకున్నా. మనం సెట్లో ప్రతి వ్యక్తి దగ్గరికీ వెళ్లి కమ్యూనికేట్ చేయనక్కర్లేదు. సబ్ కాన్షియస్ గా వాళ్లకు మన ప్రభావం వాళ్ల మీద ఉంటుంది. మనం ఉత్సాహంతో ఉంటే వాళ్లకూ ఉత్సాహం వస్తుంది. ఈ సూత్రాన్ని పాటించడం వల్లే ‘బాహుబలి’లో ఎంత కష్టమైనా ఇష్టంగానే చేశారందరూ’’ అని రాజమౌళి తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/