Begin typing your search above and press return to search.

మనమంతా ఆ టైపు కాదంటున్న రాజమౌళి

By:  Tupaki Desk   |   10 Aug 2016 6:08 AM GMT
మనమంతా ఆ టైపు కాదంటున్న రాజమౌళి
X
ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు రాజమౌళి. గత శుక్రవారం విడుదలై గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న ‘మనమంతా’ గురించి ఇప్పటికే ట్వట్టర్లో చాలా మంచి మాటలు చెప్పాడు జక్కన్న. ఐతే ఈ సినిమాకు వచ్చిన టాక్ కు అనుగుణంగా కలెక్షన్లు లేకపోవడంతో రాజమౌళి.. తనవంతుగా ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఓ కొత్త మార్గం ఎంచుకున్నాడు. ‘మనమంతా’ దర్శకుడు.. తన బంధువు అయిన చంద్రశేఖర్ యేలేటిని రాజమౌళి ఇంటర్వ్యూ చేసి.. ఈ సినిమా గురించి ఆసక్తికర సంభాషణ సాగించాడు రాజమౌళి. ఈ సందర్భంగా ‘మనమంతా’ గురించి జనాల్లో ఓ తప్పుడు అభిప్రాయం ఉందంటూ దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు రాజమౌళి.

‘‘మనమంతా తెలుగువాళ్లు మన సినిమా అని చెప్పుకుని గర్వించదగ్గ సినిమా. మధ్యతరగతి జీవితాల్ని అద్భుతంగా ప్రెజెంట్ చేస్తూ గొప్ప సినిమా తీశాడు చందూ. ఇందులో గొప్ప స్క్రీన్ ప్లే ఉంటుంది. కానీ ఆ స్క్రీన్ ప్లేను.. ఇదిగో నేనేదో గొప్పగా చేస్తున్నట్లు కాకుండా కథలో ఇమిడిపోయేలా చేశాడు చందూ. సినిమా చూస్తున్నంతసేపూ నాకేమీ అనిపించలేదు. కానీ బయటికి వచ్చాక ఆలోచిస్తే ఇందులో ఎంత గొప్ప స్క్రీన్ ప్లే ఉందో అర్థమైంది. సినిమా చూస్తున్న వాళ్లు ఎవరైనా ఇందులో ఎమోషన్ కు కనెక్టయి కంటతడి పెట్టుకుంటారు. ఐతే కంటతడి పెట్టుకుంటారని.. చాలా గొప్ప సినిమా అని అంటుంటే జనాలు ఇంకో రకంగా అర్థంచేసుకుంటున్నారు. ఇదేదో ఆర్ట్ సినిమా అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. ఇవి బాధతో వచ్చే కన్నీళ్లు కావు. సంతోషంతో వచ్చే కన్నీళ్లు. నిజానికి ఆ సోకాల్డ్ ఆర్ట్ సినిమాలంటే నాకు చిరాకు. ఈ మాట ఎవరికైనా కోపం తెప్పిస్తే తెప్పించనివ్వండి. ‘మనమంతా’ ఆ తరహా సినిమా కాదు’’ అని రాజమౌళి అన్నాడు.