Begin typing your search above and press return to search.

జక్కన్న పై ఎప్పుడు ఇంత ఒత్తిడి లేదట!

By:  Tupaki Desk   |   16 July 2021 8:31 AM GMT
జక్కన్న పై ఎప్పుడు ఇంత ఒత్తిడి లేదట!
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా కాస్త ఎక్కువ సమయంనే తీసుకుంటాడు. ఆయన బాహుబలి సినిమా రెండు పార్ట్ లను దాదాపుగా అయిదు ఆరు సంవత్సరాల పాటు తెరకెక్కించాడు. ఇక ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా కూడా దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది. కరోనా కారణంగా ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యింది. షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిన ఆర్‌ ఆర్‌ ఆర్‌ ను అక్టోబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా మేకర్స్ మరోసారి అధికారికంగా ప్రకటించారు. ఆర్ ఆర్‌ ఆర్‌ మేకింగ్‌ వీడియో లో విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌ ఆలస్యం అవుతుంది. తద్వారా సినిమా విడుదల ఆలస్యం అవుతుందని అంతా అనుకున్నారు.

వచ్చే ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే సందర్బంగా సినిమా విడుదల అవుతుందని చాలా మంది అనుకున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆఫ్‌ ది రికార్డ్‌ అదే చెప్పారు. కాని జక్కన్న మాత్రం సినిమా ను అక్టోబర్‌ లోనే విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో అంతా ఆశ్చర్య పోతున్నారు. జక్కన్న బాహుబలి రెండు పార్ట్‌ లు కూడా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత కనీసం ఆరు నెలల సమయం ను తీసుకుని మరీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేయించాడు. కాని ఆగస్టులో షూటింగ్‌ పూర్తి అయితే సెప్టెంబర్‌ ఒక్క నెల గ్యాప్‌ తో అక్టోబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.

కరోనా కారణంగా షూటింగ్‌ జరగకున్నా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది కనుక షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎక్కువ గ్యాప్ అవసరం లేకుండా పోయింది అనేది కొందరి వాదన. కాని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలను బట్టి రాజమౌళి ఈ సినిమా నిర్మాతలు మరియు ఫైనాన్షియర్స్ నుండి ఒత్తిడి ఎదుర్కొంటున్నాడట. వందల కోట్లు పెట్టిన వారు ఎక్కువ కాలం వెయిట్ చేయలేమంటూ ముందస్తుగా ఒప్పందం చేసుకున్నట్లుగా సినిమాను విడుదల చేయాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారట. అక్టోబర్‌ లో సినిమా ను విడుదల చేసేందుకు అన్ని అనుకూలంగానే ఉన్నాయి కనుక అప్పటి వరకు అయినా పూర్తి చేయాలని లేదంటే ఒప్పందం ముందు వేసి కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు బెదిరిస్తున్నారట. దాంతో జక్కన్న చేసేది లేక సినిమా ను అనుకున్నట్లుగా అక్టోబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ ప్రచారం జరుగుతున్నా కూడా అక్టోబర్‌ లోనే ఈ సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో బయ్యర్లు మరియు నిర్మాతలు ఇంకా ఫైనాన్షియర్స్ ఉన్నారట. దాంతో రాజమౌళి ఒత్తిడి కారణంగా హడావుడిగా సినిమాను పూర్తి చేసేందుకు సిద్దం అయ్యాడు అంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో గతంలో వచ్చిన ఏ సినిమా విషయంలో కూడా ఇలాంటి ఒత్తడిని ఆయన ఎదుర్కోలేదట. సినిమా బడ్జెట్‌ ఎక్కువ కనుక తప్పనిసరి పరిస్థితుల్లో రాజమౌళి కూడా ఎక్కువ ఎదిరించకుండా వారి కోరిక మేరకు సినిమాను అక్టోబర్‌ లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్‌ జక్కన్న సినిమా అంటే కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంటుంది. కనుక అన్ని చోట్ల వీలును బట్టి అక్టోబర్‌ లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవల విడుదల అయిన మేకింగ్‌ వీడియో సినిమాపై అంచనాలను మరింతగా పెచింది.