Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్'లో జక్కన ఏమి ట్విస్ట్ ప్లాన్ చేసాడో..?

By:  Tupaki Desk   |   30 March 2020 2:30 AM GMT
ఆర్.ఆర్.ఆర్లో జక్కన ఏమి ట్విస్ట్ ప్లాన్ చేసాడో..?
X
దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ఉగాది కానుకగా రిలీజయింది. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' అనే పేరుతో ఒక స్పెషల్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. అయితే ఈ రెంటిలోనూ చ‌ర‌ణ్ లుక్ చూస్తే జ‌నాల‌కు ర‌క‌ర‌కాల సందేహాలు క‌లిగాయి. ముఖ్యంగా చ‌ర‌ణ్ బ‌ర్త్ డే టీజ‌ర్ లో అత‌డి లుక్.. విజువ‌ల్స్ అనేకానేక సందేహాల‌కు తెర తీశాయి.

రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాలో చేస్తోంది మన్నెం దొర 'అల్లూరి సీతారామ‌రాజు' పాత్ర అని ముందు నుంచి చెబుతున్నారు. టీజ‌ర్లో కూడా వాయిస్ ఓవ‌ర్లో ఆ పాత్ర‌ను అల్లూరి సీతారామ‌రాజుగానే అభివ‌ర్ణించారు. కానీ చ‌ర‌ణ్‌ లుక్ చూస్తే మాత్రం అల్లూరి పోలిక‌లే లేవు. అత‌ను మిలిట‌రీ వాడిలా క‌టింగ్ చేయించుకున్నాడు. టీజ‌ర్ మొత్తంలో ప్యాంటుతోనే క‌నిపించాడు. అందులోనూ ఒక చోట అయితే పోలీస్ లాగా ఖాకీ ప్యాంటు - బెల్టు ధ‌రించాడు. దీంతో టీజ‌ర్ చూసిన వాళ్లంతా అల్లూరి సీతారామరాజు ఇలా ఉండ‌డ‌మేంటి అంటున్నారు. అస‌లు చ‌ర‌ణ్ పోలీస్‌ లా ఖాకీ ప్యాంటు - బెల్టు ఎందుకేశాడ‌న్న‌ది అంతుబ‌ట్ట‌కుండా ఉంది. సెట్ ప్రాప‌ర్టీస్ చూసినా 1920 కాలం నాటివి లాగా క‌నిపించ‌డం లేదు. కొన్ని ద‌శాబ్దాల త‌ర్వాతి కాలాన్ని సూచించేలా క‌థ సాగుతుందేమో అనిపిస్తోంది.

అంతేకాకుండా ఇది చూస్తుంటే ఈ సినిమా రెండు భిన్న కాలాల్లో న‌డుస్తుందేమో - 'అల్లూరి - కొమ‌రం భీం'ల కాలంలో కొంత క‌థ‌ను న‌డిపించినా, వాళ్లిద్ద‌రూ మ‌ళ్లీ పుడితే ఎలా ఉంటుంద‌నే కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందేమో, ఈ విష‌యంలో జ‌క్క‌న్న ఏదో ప్ర‌యోగం చేశాడేమో, తెర‌పై పెద్ద ట్విస్ట్ ఇవ్వ‌బోతున్నాడేమో అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. అయితే కొన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్న వీళ్ళిద్దరూ ఒక కారణం కోసం బ్రిటిష్ రాజ్యంలో పోలీసులుగా పనిచేస్తారని కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ పాత్ర తాలూకు వీడియో టీజ‌ర్ కూడా వ‌స్తే ఈ విష‌యంలో ఒక స్ప‌ష్ట‌త రావ‌చ్చేమో. ఇది ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న విడుదలయ్యే అవకాశం ఉంది.