Begin typing your search above and press return to search.

బాహుబలి క్లైమాక్స్.. ఏంటీ అతి?

By:  Tupaki Desk   |   27 Aug 2016 1:30 AM GMT
బాహుబలి క్లైమాక్స్.. ఏంటీ అతి?
X
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో బయటికి పొక్కకుండా చూసేందుకు రాజమౌళి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట.. ఆ సంగతి యూనిట్లో కేవలం ముగ్గురికి మాత్రమే తెలుసట. ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు.. యూనిట్ సభ్యుల్ని సైతం తికమక పెడుతున్నాడ‌ట‌.. ఈ సినిమాకు నాలుగు రకాల క్లైమాక్సులు చిత్రీకరించాడట.. ఏది బెస్ట్ అయితే దాన్ని ఫైన‌లైజ్ చేస్తాడ‌ట‌.. ఇలా రెండు మూడు రోజుల నుంచి ఒకటే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వ్యవహారమంతా చూస్తుంటే.. అసలు ఈ విషయంపై ఇప్పుడు చర్చ ఎందుకు జరుగుతోందన్న సందేహం రాకమానదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయంపై గురించి ఒకప్పుడు చర్చ జరిగింది. ఆ ప్రశ్నకు ఇప్పట్లో సమాధానం దొరకదని తేలిపోయాక ఆ సంగతి వదిలేశారు జనం.

అయినా ముందే ఆ సంగతి తెలుసుకోవాలన్న కుతూహలం కూడా జనాల్లో ఇప్పుడు లేదు. నేరుగా తెరమీదే చూసి తెలుసుకుందామని వెయిట్ చేస్తున్నారు. ఆ థ్రిల్ థియేటర్లోనే అనుభవిద్దామనుకుంటున్నారు. అలాంటిది.. ఇప్పుడు అనవసరంగా ఆ టాపిక్ ను చర్చల్లో పెడుతున్నారు. అయినా ‘బాహుబలి’ క్లైమాక్స్ నాలుగు రకాలుగా చిత్రీకరించినట్లు బయటికి ఎలా తెలిసింది? ఎక్కడో రామోజీ ఫిలిం సిటీలో గుట్టుగా షూటింగ్ జరుగుతోంది కదా. షూటింగుకి సంబంధించిన ఇతర విషయాలేవీ బయటికి రానపుడు ఇది మాత్రం ఎందుకు చర్చనీయాంశమవుతోంది?

అస‌లు ‘బాహుబలి’ గుట్టు ముగ్గురికి మాత్రమే తెలుసనడమే చిత్రం. రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్.. ప్రభాస్ ల‌కు మాత్రమే అస‌లు సంగ‌తి తెలుసు అనడం విడ్డూరం కాదా. కట్టప్ప పాత్రధారి సత్యారాజ్ కు సైతం ఆ సంగతి తెలియదా. మరీ అతిశయోక్తి కాకపోతే.. మిగతా టీంలో ఇంకెవరికీ విషయం తెలియకుండానే ఉంటుందా? వీళ్లంద‌రికీ తెలియ‌కుండానే రాజమౌళి షూటింగ్ చేస్తున్నాడా.. ఒక‌వేళ తెలిస్తే మాత్రం దాని ప్రాధాన్యం గుర్తించి విష‌యాన్ని దాచ‌లేరా? జ‌క్క‌న్న మీద.. సినిమా మీద‌ ఆ మాత్రం గౌర‌వం ఉండ‌దా..? చూస్తుంటే.. పబ్లిసిటీ కోసం ‘బాహుబలి’ టీమే ఇలా లీకులిస్తోందేమో.. లేదంటే ఎవరైనా కావాలనే ఈ ప్రచారాలు చేస్తున్నారేమో అన్న సందేహాలు కల‌గ‌క మాన‌వు. ‘బాహుబలి’కి సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా సరే.. పెద్ద వార్తయిపోతుంది. అందుకే ఇలా ఉత్తుత్తి ప్రచారం చేసేవాళ్లు కూడా లేకపోలేదు. ఏదేమైనా ‘బాహుబలి’ క్లైమాక్స్ గురించి ప్రస్తుతం నడుస్తున్న చర్చ మాత్రం అర్థరహితంగానే క‌నిపిస్తోంది.