Begin typing your search above and press return to search.
రాజమౌళి అలా అనుకున్నాడట
By: Tupaki Desk | 25 March 2016 9:14 AM GMTకొన్ని గంటల క్రితమే విడుదలైన ఊపిరి సినిమాకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి ఊపిరి పోసిన మరో మంచి సినిమా అని మెచ్చుకుంటున్నారు. నాగ్ - కార్తీల నటన గురించి మాట్లాడుతుండడం ఒకెత్తైతే, దర్శకుడు వంశీ పైడిపల్లి గురించి మాట్లాడుతుండటం మరో ఎత్తు. ప్రపంచంలోని అత్యుత్త్యమమైన చిత్రాల్లో ఒకటైన `ఇన్ టచబుల్స్`ని వంశీ ఇండియనైజ్ చేసిన విధానం అదుర్స్ అని అభినందిస్తున్నారంతా. దర్శకధీరుడు రాజమౌళి కూడా ఆ విషయంలో వంశీని ఆకాశానికెత్తేశాడు. ``నిజం చెబుతున్నా `ది ఇన్ టచబుల్స్`ని వంశీ హ్యాండిల్ చేయలేడనుకొన్నా. కానీ తను తీసిన విధానం చూసి నా అభిప్రాయం తప్పని తెలిసింది. నా అభిప్రాయాన్ని వమ్ము చేసినందుకు వంశీకి కృతజ్ఞతలు`` అని అభినందించాడు రాజమౌళి. ఇంకా ఇంటర్నెట్ లో ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ``మేం వంశీ కోసం సినిమాకి వెళ్లలేదు. కేవలం కార్తీ - నాగార్జునలాంటివాళ్లు ఉన్నారనే సినిమాకి వెళ్లాం. కానీ వంశీకోసం కూడా ఇకపై సినిమాకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం`` అన్న వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో దర్శనమిచ్చాయి. మొత్తమ్మీద వంశీ ఈ సినిమాతో టాప్ లీగ్ లోకి వెళ్లిపోయినట్టే. అఖిల్ తో వంశీ సినిమా ఖాయం చేస్కోండిక!