Begin typing your search above and press return to search.

బ్రహ్మాస్త్ర : అక్కడ కూడా మా జక్కన్నని వాడాల్సింది!

By:  Tupaki Desk   |   11 Sep 2022 12:51 PM GMT
బ్రహ్మాస్త్ర : అక్కడ కూడా మా జక్కన్నని వాడాల్సింది!
X
రణబీర్ కపూర్‌.. ఆలియా భట్ జంటగా దాదాపుగా 400 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే వంద కోట్లకు పైగా సినిమా వసూళ్లను రాబట్టింది.. కానీ ఆ మొత్తం బ్రహ్మాస్త్ర సినిమాకి సరిపోయే మొత్తం కాదు. వెయ్యి కోట్ల వసూళ్లు లక్ష్యంగా విడుదల అయిన బ్రహ్మాస్త్ర సినిమాకు నమోదు అవుతున్న వసూళ్లు తీవ్ర నిరాశను పర్చుతున్నాయి.

ఉత్తర భారతంలో ఏమో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పది కోట్ల వసూళ్లకు చేరువ అయ్యింది. చాలా సంవత్సరాల క్రితం క్రిష్ సినిమా సాధించిన స్థాయిలో బ్రహ్మాస్త్ర తెలుగు లో వసూళ్లను రాబట్టింది. వీక్‌ డేస్ లో కూడా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయగలిగితే కచ్చితంగా ఇక్కడ మంచి విజయంగా చెప్పుకోవచ్చు.

తెలుగు లో రాజమౌళి సమర్పించడంతో పాటు ఎన్టీఆర్‌ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ లో పాల్గొనడం వల్లే ఈ బజ్ క్రియేట్‌ అయ్యి మంచి ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఈ సమయంలోనే రాజమౌళి అభిమానులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగు లో మరియు ఇతర సౌత్‌ భాషల్లో బ్రహ్మాస్త్ర ని సమర్పించిన కారణంగా ఇక్కడ భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఆయన వల్లే ఈ స్థాయి విజయం సాధ్యం అయ్యింది.

అందుకే రాజమౌళి కేవలం సౌత్‌ లోనే కాకుండా ఉత్తర భారతంలో కూడా సమర్పకుడిగా వ్యవహరిస్తే బాగుండేది అంటూ జక్కన్న అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా నిర్మాతలు సౌత్‌ లో ఎలాగూ రాజమౌళి ని ప్రజెంటర్ గా టైటిల్ కార్డ్‌ వేశారు. అలాగే హిందీ వర్షన్‌ కి కూడా సమర్పకుడిగా టైటిల్ కార్డ్‌ వేసి ఉంటే బాగుండేది అంటూ జక్కన్న అభిమానులు అంటున్నారు.

జక్కన్న పేరుతో మరియు సెంటిమెంట్‌ తో అక్కడ కూడా సక్సెస్ అయ్యి భారీ వసూళ్లు నమోదు అయ్యేవేమో అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరణ్‌ జోహార్ టీమ్ సినిమా విడుదలకు ముందు ఈ విషయాన్ని ఆలోచించి ఉంటే చాలా నష్టం తప్పేదేమో అంటూ జక్కన్న ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.