Begin typing your search above and press return to search.

RRR బెనిఫిట్ షోలపై రాజమౌళి ఏమన్నారంటే..?

By:  Tupaki Desk   |   16 March 2022 2:10 PM GMT
RRR బెనిఫిట్ షోలపై రాజమౌళి ఏమన్నారంటే..?
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త జీవోతో ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు తీపికబురు చెప్పింది. సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసి.. గతేడాదిగా కొనసాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది.

వంద కోట్లు మరియు అంతకుమించి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలను.. తెలుగు సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే చిత్రాలను ప్రత్యేకంగా పరిగణించి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది.

అలానే పెద్ద సినిమాలతో పాటుగా చిన్న చిత్రాలకు కూడా అదనంగా ఐదో షో వేసుకోడానికి అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. ఏపీ సర్కారు ఇచ్చిన జీవోని పూర్తిగా వినియోగించుకునే మొదటి సినిమాగా 'ఆర్.ఆర్.ఆర్' నిలవనుంది.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో దర్శకుడు రాజమౌళి ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాని తెరకెక్కించారు. ఇటీవల దర్శక నిర్మాతలు సీఎం జగన్ కు కలిసి ఇదే విషయాన్ని వివరించారు.

ఈ నేపథ్యంలో RRR చిత్రానికి టికెట్ రేట్ పై వంద రూపాయలు పెంచుకునేలా ఏపీ సర్కారు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. మార్చి 25న సినిమా రిలీజ్ అవుతుండగా.. పెయిడ్ ప్రివ్యూలకు సంబంధించి ఇంకా చర్చలు సాగుతున్నాయి. దీనిపై ఈ రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అదనపు షోలపై స్పందించిన రాజమౌళి.. తమ సినిమాకు ప్రతి రోజూ ఓ బెనిఫిట్ షో ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఐదు షోలకు అనుమతిచ్చింది కాబట్టి.. ఏదో ఒక రోజు బెనిఫిట్ షో ఇచ్చినట్టు కాదు.. అన్ని రోజులు బెనిఫిట్ షో ఇచ్చినట్టయిందన్నారు జక్కన్న.

పెయిడ్ ప్రివ్యూలకు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుపుతున్నామని.. ఏపీ, తెలంగాణలోని కీలకమైన అన్ని సెంటర్లలో ప్రివ్యూలు వేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. దానికి సంబంధించి అనుమతులు తీసుకోవాలని.. RRR డిస్ట్రిబ్యూటర్లు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారని దర్శకుడు చెప్పారు.