Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ అలా.. రామారావు ఇలా: రాజమౌళి

By:  Tupaki Desk   |   8 Feb 2022 11:30 PM GMT
రామ్ చరణ్ అలా.. రామారావు ఇలా: రాజమౌళి
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ ''ఆర్.ఆర్.ఆర్'' కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో నిర్వహించిన ఈవెంట్ కు సంబంధించిన వీడియోని మేకర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసారు.

రాజమౌళి - రామ్ చరణ్ - ఎన్టీఆర్ - అలియా భట్ లు పాల్గొన్న ఈ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ - స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చరణ్ - తారక్ ల మధ్య ఉన్న తేడా గురించి.. నటీనటులతో కలిసి పనిచేసిన అనుభవం గురించి.. సినిమా కోసం వాళ్లు పడ్డ కష్టాల గురించి జక్కన్న వివరించారు. ''రామ్ చరణ్ అద్భుతమైన నటుడు.. కానీ ఆ విషయం తనకు తెలియదు. తారక్ కూడా అద్భుతమైన నటుడు.. ఆ విషయం తనకు తెలుసు" అని రాజమౌళి తెలిపారు.

''చరణ్‌ తో అద్భుతమైన షాట్‌ ను పూర్తి చేసిన తర్వాత, మానిటర్‌ లో షాట్‌ ని చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. దీంతో చరణ్ దగ్గరకు వెళ్లి గట్టిగా హగ్ చేసుకుని అద్భుతంగా చేశావు అని మెచ్చుకుంటా. 'బాగుందా సర్.. మీకు నచ్చిందా.. మీకు నచ్చితే ఓకే' అని అంటాడు. చరణ్ అంటే అలాంటి వ్యక్తి. అదే తారక్ విషయానికి వస్తే, షాట్ అద్భుతంగా ఉందని చెప్పకముందే 'జక్కన్నా.. అదరగొట్టేశా కదా' అని అంటాడు. తనపై తనకున్న విశ్వాసం అది. ఇలాంటి ఇద్దరు గొప్ప నటులతో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది'' అని రాజమౌళి అన్నారు.

''సినిమా కోసం ఎన్టీఆర్ - చరణ్ లను విపరీతంగా కష్టపెట్టా. కావాల్సిన అవుట్‌ పుట్ వచ్చేలా షూటింగ్ తొలి రోజు నుంచే శ్రమ పెట్టా. తారక్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ కోసం మేము అతన్ని బల్గేరియా అడవులకు తీసుకెళ్లాము. అతను చెప్పులు కూడా లేకుండా అడవిలో పరిగెత్తాడు. అతను ఒక పులిలా పరిగెత్తాడు. అలానే చరణ్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ కోసం రెండు వేల మంది జనం మధ్యలో దుమ్ములో నిలబెట్టా. అతనికి చెమట, రక్తం కారుతున్నా సరే వదిలి పెట్టలేదు. నా కెరీర్ లో ది బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ ఇది''

''షూటింగ్ రెండో రోజు బ్రిడ్జి సన్నివేశం తెరకెక్కించాం. దీని కోసం వీరిద్దరూ రోప్స్ సాయంతో 60 అడుగులు గాల్లోకి జంప్ చేశారు. డిసెంబర్‌ లో 1200 మందితో 5-6 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 65 రాత్రులు పాటు ఇంటర్వెల్ ఎపిసోడ్‌ ను షూట్ చేసాం. పాటలు క్లైమాక్స్ కోసం వారు అంతే కష్టపడ్డారు. ఈ చిత్రంలో అత్యద్భుతమైన సీన్ ఒకటుంది. టీజర్, ట్రైలర్ లో దాన్ని చూపించలేదు. సినిమాలో ఆ సీక్వెన్స్ వచ్చినప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీ శరీరంలోని ప్రతి నరం బిగుసుకుపోతుంది. చరణ్, తారక్ అలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చారు" అని రాజమౌళి చెప్పుకొచ్చారు.