Begin typing your search above and press return to search.

దేశభక్తి.. తెలుగు యూనిటీని కలిపికొడుతున్న జక్కన్న!

By:  Tupaki Desk   |   15 March 2019 6:54 AM GMT
దేశభక్తి.. తెలుగు యూనిటీని కలిపికొడుతున్న జక్కన్న!
X
ప్రపంచం మొత్తంమీద భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ఉదాహరణ ఉండే దేశాన్ని చూపించమని అడిగితే ఎవరైనా ఖచ్చితంగా భారతదేశాన్ని చూపించాల్సిందే. ఇండియాలో ఉన్నన్ని భాషలు.. మతాలు..కులాలు ఇంకెక్కడా ఉండవు. మళ్ళీ కులాల్లో తెగలు.. ఇలా సాగుతుంది వ్యవహారం. ఇంత రచ్చలో కూడా అందరూ కలిసి ఉంటారు. పాకిస్తాన్ అనే పేరెత్తగానే అందరూ ఒక్కటైపోతారు. అంటే తమలో ఉండే విభేదాలను మరిచిపోయేంతగా దేశభక్తి ఆవహిస్తుందన్నమాట. అందుకే ఫిలిం మేకర్స్ కు దేశభక్తి కాన్సెప్ట్ ఎప్పుడు కాసులు కురిపించే కల్పవృక్షం.

జక్కన్న కూడా RRR కు ఆ దేశభక్తి నేపథ్యం ఎంచుకోవడానికి ఒక కారణం అదే అయి ఉండొచ్చు. కొమరం భీం నిజాం నిరంకుశ పాలనపైన.. అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారిపై తిరగబడి తమ హక్కుల కోసం పోరాడారు. ఆసలు వారిని ఆ దిశగా పురిగొల్పిన సంఘటనల నుండి మొదలు పెట్టి.. వారు అజ్ఞాత జీవితం గడిపిన సమయంలో ఏం జరిగిందనేది చూపిస్తామని చెప్పుకొచ్చారు. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా కాన్సెప్ట్ కోసం చూస్తున్న రాజమౌళికి దేశభక్తి కాన్సెప్ట్ కంటే మించిన యూనివర్సల్ ప్లాట్ ఇంకేముంటుంది.

ఇదిలా ఉంటే నాణేనికి మరోవైపు అన్నట్టుగా ఒకరు తెలంగాణా యోధుడు.. మరొకరు అంధ్రా ప్రాంత వీరుడు. నిన్న ప్రెస్ మీట్ లో"చెక్ బాక్స్ లు చూసి టిక్ లు కొట్టి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏదీ చేయలేదని" అంటున్నాడు కానీ ఇలా రెండు రాష్ట్రాలకు చెందిన యోధులను ఎంచుకోవడం ద్వారా దేశభక్తితో పాటుగా.. తెలుగు యూనిటీ కాన్సెప్ట్ ను కలిపికొట్టేందుకు ప్లాన్ వేసినట్టే. నిజంగా జక్కన్న చెక్ బాక్సులకు టిక్ లు పెట్టకపోతే ఇద్దరు తెలంగాణా యోధుల జీవితాలను.. లేదా ఇద్దరూ ఆంధ్ర ప్రదేశ్ వీరుల జీవితాలను ఎంచుకోవచ్చు కదా? ఇదేమీ కోడి గుడ్డుపై ఈకలు పీకే వ్యవహారం కాదు. ఏదేమైనా జక్కన్న ఉద్దేశం మంచిది కాబట్టి అందులో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.