Begin typing your search above and press return to search.

ఇంకా బ్యాచ్ అంతా ‘ఉప్మా’ మీద బతికేస్తారా?

By:  Tupaki Desk   |   27 Oct 2015 11:30 AM GMT
ఇంకా బ్యాచ్ అంతా ‘ఉప్మా’ మీద బతికేస్తారా?
X
పోకిరి సినిమాలో హీరో మహేష్ బాబు చెప్పే డైలాగ్ ను సినీ ప్రేక్షకుడు ఎవరూ అంత త్వరగా మర్చిపోరు. ‘‘ఫ్యామిలీ.. ఫ్యామిలీ ఉప్మా మీద బతికేస్తున్నారా?’’ అంటూ చెప్పటం. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళి మాటల్ని వింటే.. మహేశ్ బాబు డైలాగ్ గుర్తుకు రాక మానదు. తన కలల ప్రాజెక్టు అయిన బాహుబలి సినిమా అనుకున్న దానికంటే భారీగా సక్సెస్ కావటమే కాదు.. సమీప భవిష్యత్తులో బాహుబలి నెలకొల్పిన రికార్డు కలెక్షన్లను మరే తెలుగు చిత్రం బీట్ చేయలేని పరిస్థితి. బాహుబలి ద బిగినింగ్ రికార్డు కలెక్షన్లను బ్రేక్ చేసే సత్తా ఉందంటే అది బాహుబలి 2 పార్ట్ కే.

బాహుబలి ఇచ్చిన విజయంతో ఆ చిత్ర దర్శక నిర్మాతలు ఎంతగా ఖుషీ అయ్యారన్నది వారి మాటల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏళ్ల తరబడి వారి కష్టానికి తగ్గ ఫలితం వారికి కొత్త ఉత్సాహాన్ని కలిగించటం ఖాయం. మొన్నటి వరకూ బాహుబలి రాజమౌళి డ్రీం మాత్రమే అయితే.. ఇప్పుడు బాహుబలి ఒక బలమైన బ్రాండ్ గా మారిపోయింది. ఈ కారణంతోనే.. తన బ్రాండ్ కు వచ్చిన ఇమేజ్ ను.. మైలేజ్ ని మరింత సొమ్ము చేసుకోవాలన్న ప్లాన్ లో రాజమౌళి ఉన్నారు. అందుకేనేమో.. బాహుబలి మొదటి భాగం విడుదలై.. చివరకు టీవీల్లో వచ్చేస్తున్నా.. రెండో పార్ట్ షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. బాహుబలిని ఒక బ్రాండ్ గా మార్చే విషయంలో ఆయన ఇప్పటికే విపరీతంగా మధనం చేస్తున్నారు.

దీనికి తుది రూపమే.. బాహుబలి పార్ట్ 3 ప్రకటన అని చెప్పొచ్చు. బాహుబలి 2 పార్ట్ ఎప్పటికి పూర్తి అయి.. థియేటర్లను టచ్ చేస్తుందో పక్కాగా చెప్పలేని పరిస్థితి. కానీ.. బాహుబలి 3 పార్ట్ ఎలా ఉంటుంది. అందులో ఏమేం ఉండే అవకాశం ఉంది? ఏమేం ఉండదనే విషయాల్ని రాజమౌళి మాట్లాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. బాహుబలి 2 మీద కంటే ఇప్పుడు ఆయన ఫోకస్ 3 మీద ఉన్నట్లుగా కనిపిస్తుంది. బాహుబలి 2లో కథ మొత్తాన్ని ముగిస్తానని.. పార్ట్ 3లో భిన్నమైన కాన్సెప్ట్ తీసుకొస్తానని చెబుతున్నారు. మొదటి భాగం విడుదలై.. టీవీల్లో వచ్చేస్తుంటే రెండో భాగం గురించి ఇప్పటివరకూ ఊసే లేని నేపథ్యంలో.. పార్ట్ 3 గురించి చర్చ భారీగా సాగటం చూస్తే.. రాజమౌళి అండ్ కో మొత్తం బాహుబలి మీద బతికేయాలని ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తుంది.

ఎందుకంటే.. బాహుబలి సినిమా 2016 చివరి నాటికి పూర్తి చేస్తే అది అద్భుతం అని చెప్పక తప్పదు. అయితే.. అదేమీ కష్టం కాదని చెబుతున్నా.. మొదటి భాగం ఇచ్చిన సక్సెస్ కిక్ తో.. సెకండ్ పార్ట్ ‘‘నాణ్యత’’ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదన్న మాట స్పష్టంగా వినిపిస్తోంది. అదే నిజమైతే.. 2016లో బాహుబలి రావటం కష్టమే. ఇక.. పార్ట్ 2 విడుదలై.. థియేటర్లను ఊపేస్తేనే పార్ట్ 3 వ్యవహారం వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంది. అదే జరిగితే.. పార్ట్ 2 విడుదలయ్యాక దాని విజయోత్సవ వేడుకలు.. కాస్తంత రిలీఫ్ కోసం బయటకు వెళ్లి రావటం లాంటివి పూర్తి చేసి పార్ట్ 3 మీద పని మొదలు పెడితే.. ఈ పనులు ఎప్పటికి పూర్తి అయ్యేటట్లు? అందుకే.. రాజమౌళి మరే ఇతర సినిమాల్ని ఒప్పుకునే అవకాశం లేదు. మొత్తంగా పార్ట్ 3 మొదలై.. అది పూర్తి అయి థియేటర్లలో టచ్ అయ్యేందుకు తక్కువలో తక్కువ రెండు మూడేళ్లు పట్టటం ఖాయం. అంటే.. బాహుబలితోనే రానున్న మూడు.. నాలుగేళ్లు గడిపేస్తారన్న మాట. చూస్తుంటే.. బాహుబలి టీం మొత్తం బాహుబలి మీద బతికేసేటట్లుందే.