Begin typing your search above and press return to search.

రాజమౌళి.. శంకర్‌ ను టార్గెట్ చేశాడా?

By:  Tupaki Desk   |   23 Nov 2018 1:30 AM GMT
రాజమౌళి.. శంకర్‌ ను టార్గెట్ చేశాడా?
X
కొన్నేళ్ల కిందటి వరకు దక్షిణాదిన నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే శంకర్ పేరే వినిపించేది. కంటెంట్ పరంగా చూస్తే.. అతడిని మించిన దిగ్గజ దర్శకులు ఇక్కడ ఉన్నప్పటికీ కంటెంట్ తో పాటు సక్సెస్ రేట్.. రీచ్.. భారీతనం.. ఈ కోణాల్ని కూడా కలిపితే శంకర్ మిగతా దర్శకుల కంటే పైన నిలిచేవాడు. ఐతే ‘మగధీర’.. ‘ఈగ’ లాంటి సినిమాలతో శంకర్ కు దీటుగా నిలిచిన మన దర్శక ధీరుడు రాజమౌళి.. ఆ తర్వాత ‘బాహుబలి’తో అతడిని మించిపోయాడు. టెక్నాలజీని వాడుకోవడంలో.. ఎఫెక్ట్స్ విషయంలో శంకర్ ను మించినోడు ఇండియాలోనే లేడనేవాళ్లు. కానీ రాజమౌళి ‘బాహుబలి’తో అందరినీ వెనక్కి నెట్టేశాడు. దీంతో శంకర్ ‘2.0’తో తన స్థాయి చూపించే ప్రయత్నం చేశాడు. వీఎఫెక్స్ సహా టెక్నికల్ గా అన్ని విషయాల్లోనూ ఈ సినిమాను మేటిగా నిలబెట్టడానికి కష్టపడ్డాడు. రిలీజ్ ఎంత ఆలస్యమవుతున్నా రాజీ పడకుండా హాలీవుడ్ స్థాయి వీఎఫెక్స్ ఔట్ పుట్ కోసం ట్రై చేశాడు.

మరోవైపు హై ఎండ్ త్రీడీ టెక్నాలజీతో సినిమా తీయడం.. 4డీ సౌండ్ ఉపయోగించడం ద్వారా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు. రాజమౌళిని అధిగమించాలనే శంకర్ ఈ ఆకర్షణలన్నీ జోడించాడన్న అభిప్రాయాలు కలిగాయి జనాలకు. ఐతే ‘2.0’ రిలీజవుతున్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్లో తన కొత్త సినిమా మొదలుపెట్టిన రాజమౌళి.. ఈ చిత్రాన్ని కూడా టెక్నికల్‌ గా తిరుగులేని విధంగా తీర్చిదిద్దాలని డిసైడయ్యాడంటున్నారు. ‘2.0’ కోసం శంకర్ వాడిన 4డీ సౌండ్ టెక్నాలజీని మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు తన టెక్నికల్ టీంతో ప్రణాళిక రచించాడట. ఇందుకోసం హాలీవుడ్ నుంచి హైఎండ్ పరికరాలు తెప్పించాడట. ‘ఆర్ ఆర్ ఆర్’ వీఎఫెక్స్.. గ్రాఫిక్స్ తో పెద్దగా పనిలేని సినిమానే అయినప్పటికీ.. మిగతా విషయాల్లో మాత్రం టెక్నికల్ గా తిరుగులేని స్థాయి ఉండాలని రాజమౌళి భావిస్తున్నాడట. రెండు రోజుల కిందటే ‘ఆర్ ఆర్ ఆర్’ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. నేరుగా యాక్షన్ సీక్వెన్స్ తో చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ సీక్వెన్స్ కోసం 120 కెమెరాలు వాడుతున్నట్లు వార్తలొస్తుండటం విశేషం.