Begin typing your search above and press return to search.

బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కోసం రాజమౌళి ముందుగా అనుకున్న హీరోలు ఎవరంటే..!

By:  Tupaki Desk   |   3 Aug 2021 2:30 AM GMT
బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కోసం రాజమౌళి ముందుగా అనుకున్న హీరోలు ఎవరంటే..!
X
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్‌ ఆర్‌ ఆర్‌''. టాలీవుడ్ లోని రెండు పెద్ద ఫ్యామిలీలకు చెందిన హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారనే సంగతి తెలిసిందే. అయితే స్టార్ రైటర్ తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. RRR ఎలా పుట్టిందనే ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ''బేసిక్ గా ఇద్దరు హీరోలతో ఓ సినిమా చేయాలని రాజమౌళి అనుకున్నాడు. ఎలాంటి కాంబినేషన్ లో చేద్దాం అని ఆలోచించాం. రజనీకాంత్‌-ఎన్టీఆర్‌.. సూర్య-కార్తీ.. కార్తీ-అల్లు అర్జున్.. అల్లు అర్జున్‌-ఎన్టీఆర్‌.. ఇలా రకరకాల కాంబినేషన్స్ అని తిరుగుతున్నప్పుడు.. రాజమౌళి ఒక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ తో నా దగ్గరకు వచ్చాడు'' అని చెప్పారు.

''అల్లూరి సీతారామరాజు పోరాటయోధుడిగా మారడానికి ముందు కాలేజీ చదువు పూర్తి చేసుకుని ఓ రెండేళ్లపాటు ఎక్కడికో వెళ్లిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్లారు? ఆ రెండేళ్లు ఏమి చేశారు? అనే దాని గురించి ఎక్కడా కూడా సరైన సమాచారం లేదు. అక్కడి నుంచి వచ్చాకే ఆయన బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేశారు. రామరాజు వెళ్లిన అదే సమయంలోనే కొమురం భీమ్‌ కూడా కొంతకాలం తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కడికో వెళ్లారు. అక్కడి నుంచి వచ్చాకే పోరాటం చేసి మనకు తెలిసిన కొమురం భీమ్‌ అయ్యాడు''

''ఈ విషయాన్ని నాతో చెప్పిన రాజమౌళి.. 'నాన్నగారు.. వీళ్లిద్దరూ ఒకే సమయంలో కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. ఒకవేళ వీళ్లిద్దరూ ఒకరికొకరు తారసపడితే ఎట్లా ఉంటుంది? వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది?’ అని అడిగాడు. అలా RRR కథ మొదలైంది'' అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. సీత పాత్ర గురించి చెబుతూ ఇద్దరు మహావీరుల మధ్య ఆమె పెద్ద రిలీఫ్ అని అన్నారు. సీత పాత్ర ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందని.. రామారాజు - భీమ్ ల మధ్య ఆమె ఒక కనెక్టింగ్ అంశమని.. ఇంటర్వెల్ అద్భుతంగా ఉంటుందని 'బాహుబలి' రచయిత అన్నారు.

కాగా, 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆలియా భట్‌ - ఒలీవియా మోరీస్‌ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ - సముద్ర ఖని - శ్రియ లతో పాటుగా పలువురు హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌ తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో అక్టోబర్ 13న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టిన జక్కన్న అండ్ టీమ్.. 'రోర్ ఆఫ్ RRR' పేరుతో మేకింగ్ వీడియో రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. ఈ క్రమంలో స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న ఆదివారం (ఆగస్ట్ 1) ‘దోస్తీ’ అనే ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ వంటి ఐదు ప్రధాన భారతీయ భాషల్లో విడుదలైన ఈ పాట సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.