Begin typing your search above and press return to search.

చిరుతో రాజశేఖర్ దంపతుల కబుర్లివే

By:  Tupaki Desk   |   3 Nov 2017 4:54 AM GMT
చిరుతో రాజశేఖర్ దంపతుల కబుర్లివే
X
మెగాస్టార్ చిరంజీవితో రాజశేఖర్-జీవిత దంపతులకు గతంలో కొన్ని విబేధాలు ఉండేవనే సంగతి తెలిసిందే. చిరు పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాహాటంగానే పలు విమర్శలు చేశారు వీరిద్దరూ. అయితే.. కాలం అన్ని సమస్యలకు సమాధానం చెప్పేస్తుంది. తాజాగా రాజశేఖర్ దంపతులు ఇద్దరూ కలిసి చిరంజీవిని కలిశారు. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్.. మీడియాకు చెప్పగా.. ఇప్పుడు ఈ మీటింగ్ కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.

చిరంజీవి ప్రస్తుతం మాలలో ఉన్నారు. ఆయనను కలిసిన జీవిత.. రాజశేఖర్ లు.. పీఎస్వీ గరుడవేగ మూవీలో కొంత భాగాన్ని చూపించారు. ఇప్పటికే తాను ట్రైలర్ ను చూసినట్లు చెప్పిన చిరు.. జీవిత స్వయంగా మూవీలో కొంత భాగాన్ని చూడాలని కోరి.. తమతో పాటు తీసుకొచ్చిన ల్యాపీలో చూపించారు. సన్నివేశాలను ఆద్యంతం ఆసక్తిగా తిలకించిన చిరు.. యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. చాలాకాలం తర్వాత హాలీవుడ్ స్థాయి మూవీ చూస్తున్నట్లుగా ఉందంటూ ప్రశంసించిన చిరు.. పీఎస్వీ గరుడవేగ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఇటు రాజశేఖర్.. జీవితలు కూడా చిరంజీవితో చాలాసేపే పిచ్చాపాటీ మాట్లాడారు. ఆ మీటింగ్ సమయంలో కనీసం తమ ఫోన్ ను ఉపయోగించేందుకు కూడా జీవిత ఇష్టపడలేదంటే.. ఎంతగా ఈ భేటీకి జీవిత.. రాజశేఖర్ లు ప్రాధాన్యత ఇచ్చారో అర్ధమవుతుంది.