Begin typing your search above and press return to search.

రాజ‌శేఖ‌ర్ ఓట‌మిని భ‌రించ‌రు! -జీవిత‌

By:  Tupaki Desk   |   11 March 2019 6:53 AM GMT
రాజ‌శేఖ‌ర్ ఓట‌మిని భ‌రించ‌రు! -జీవిత‌
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల పోరులో అధ్య‌క్షుడిగా న‌రేష్ ఎన్నిక‌య్యారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జీవిత‌, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్య‌క్షుడిగా రాజ‌శేఖ‌ర్ చ‌క్క‌ని మెజారిటీతో గెలుపొందారు. మా గ‌త అధ్య‌క్షుడు శివాజీ రాజాను క‌లుపుకుని మంచి ప‌నులు చేసేందుకు ముందుకు వెళ‌తామ‌ని కొత్త క‌మిటీ ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా నిన్న‌టి సాయంత్రం వ‌ర‌కూ సాగిన ఉత్కంఠ‌భ‌రిత‌మైన కౌంటింగ్ సెష‌న్స్ అనంత‌రం జీవిత రాజ‌శేఖ‌ర్ మీడియా స‌మ‌క్షంలో `మా` ఎన్నిక‌ల‌పై త‌న‌ అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.

ఇంత‌కాలం మా కేవ‌లం ప‌ది మంది చేతుల్లోనే ఉండ‌డం వ‌ల్ల చాలా విష‌యాలు బ‌య‌టికి తెలియ‌లేదు. అందుకే ఈసారి ప్ర‌తి ఒక్క‌రిని ఓటేయ‌మ‌ని అడిగాం. అందుకోసం మాతో పాటు మా పిల్ల‌లు కూడా ఫోన్లు చేసి ఆర్టిస్టుల‌ను ఓట్లు అడిగారు అని తెలిపారు. వాస్త‌వానికి ఈ ఎన్నిక‌ల్లో రాజ‌శేఖ‌ర్ ను ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పోటీ చేయాల్సిందిగా న‌రేష్ కోరారు. కానీ రాజ‌శేఖ‌ర్ ఆ ప‌ద‌వికి న‌న్నే పోటీ చేయ‌మ‌ని ఎంక‌రేజ్ చేశారు. ఆ త‌ర్వాత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయ‌మ‌ని న‌రేష్ రాజ‌శేఖ‌ర్ ను కోర‌డంతో పోటీ చేశారు .. అని తెలిపారు.

నిజానికి రాజ‌శేఖ‌ర్ `మా` ఎన్నిక‌ల్లో పోటీ చేయొద్ద‌ని మేమంతా అత‌డిని వ‌ద్ద‌ని అన్నాం. ఎందుకంటే ఆయ‌న‌ ఓట‌మిని అస్స‌లు త‌ట్టుకోలేరు. చిన్న చిన్న ఆట‌ల్లోనే ఓట‌మిని అంగీక‌రించ‌రు. క్యారమ్స్ ఆడేప్పుడే ఓట‌మిని అంగీక‌రించేవారు కాదు. చాలా సెన్సిటివ్ మ‌నిషి. అందుకే నా పిల్ల‌లు నేను వ‌ద్ద‌ని అన్నాం. కానీ రాజ‌శేఖ‌ర్ ని మెజారిటీతో గెలిపిస్తామ‌ని న‌రేష్ ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ ని నిల‌బెట్టుకున్నారు. భారీ విజ‌యం ద‌క్క‌డం ఆనందంగా ఉంది. మెజారిటీ ఇచ్చి స‌భ్యులు గెలిపించినందుకు ధ‌న్య‌వాదాలు అని అన్నారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థి టీమ్ ఎంతో బ‌ల‌మైన టీమ్ కావ‌డంతో తాము ఎంతో శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని జీవిత రాజ‌శేఖ‌ర్ తెలిపారు. మ‌మ్మ‌ల్ని గెలిపించిన అంద‌రికీ శిరస్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాన‌ని జీవిత అన్నారు. చిరు, బాల‌కృష్ణ‌, మ‌హేష్‌, ఎన్టీఆర్, ప్ర‌భాస్ అంద‌రు పెద్ద స్టార్ల‌ను క‌లిశామ‌ని తెలిపారు. ప్లానింగ్ చేయండి మీ వెంట ఉంటామ‌ని వీరంతా భ‌రోసా ఇచ్చార‌ని జీవిత వెల్ల‌డించారు.