Begin typing your search above and press return to search.

తమ్మారెడ్డి విమర్శలపై రాజశేఖర్ జవాబిది

By:  Tupaki Desk   |   28 Nov 2017 8:43 AM GMT
తమ్మారెడ్డి విమర్శలపై రాజశేఖర్ జవాబిది
X
సీనియర్ హీరో రాజశేఖర్ షూటింగులకు లేటుగా వస్తాడనే విమర్శలు ఈ రోజువి కావు. ఈ విషయమై గతంలో ఒక ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ రాజశేఖర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. రాజశేఖర్ తో సినిమా వద్దని చాలామంది చెప్పినా వినలేదని.. అతడితో ‘వేటగాడు’ సినిమా చేశానని.. ఆ సినిమా వల్ల తన కెరీరే నాశనమైందని.. ఈ సినిమా షూటింగ్ టైంలో రాజశేఖర్ అసలేమాత్రం సహకరించలేదని.. అతడి వల్లే సినిమా పోయిందని తమ్మారెడ్డి ఆరోపించారు అప్పట్లో. ఈ ఆరోపణలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ స్పందించాడు.

తమ్మారెడ్డి విమర్శలపై గతంలోనే స్పందిద్దామనుకున్నానని.. కానీ ఎందుకులే అని ఊరుకున్నానని.. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడతానని రాజశేఖర్ అన్నాడు. గతంలో అయితే తన జవాబు మరోలా ఉండేదని.. కానీ ఇప్పుడు తాను ఎవరినీ హర్ట్ చేయదలుచుకోకూడదన్న ఆలోచనతో ఉన్నానని.. అందుకే ఆయన్ని తిట్టకుండా బదులిస్తానని.. తమ్మారెడ్డి మాటలు తననెంతో బాధపెట్టాయని.. ఆయన అలా మాట్లాడటం ముమ్మాటికీ తప్పని రాజశేఖర్ అన్నాడు. తమ్మారెడ్డి ‘వేటగాడు’ కంటే ముందు ఎలాంటి సినిమాలు తీశారు.. ఎన్ని హిట్లిచ్చారు.. దర్శకుడిగా ఆయన ట్రాక్ రికార్డు ఏంటి అన్నది చూడాలన్నారు రాజశేఖర్. ‘డ్యాన్స్ సరిగా రాని అమ్మాయి స్టేజ్ బాగా లేదు అందట’ అంటూ తమిళంలో ఒక సామెత ఉంటుందని.. తమ్మారెడ్డి తీరు కూడా ఇలాగే ఉందని రాజశేఖర్ అన్నాడు.

తాను కోడి రామకృష్ణ.. ముత్యాల సుబ్బయ్య.. రవిరాజా పినిశెట్టి లాంటి పెద్ద దర్శకులతో చాలా సినిమాలు చేశానని.. మరి తాను షూటింగులకు లేటుగా వచ్చేట్లయితే వాళ్లందరూ తనతో అన్ని సినిమాలు ఎలా చేస్తారని రాజశేఖర్ ప్రశ్నించాడు. తాను చెప్పిన టైం కంటే కొంచెం లేటుగా వస్తానని.. ఆ విషయం అందరికీ తెలుసని.. అంటే తప్ప గంటలు గంటలు లేట్ చేయనని.. ‘వేటగాడు’ షూటింగ్ టైంలో ఒకసారి కరెక్ట్ టైంకు వచ్చి.. ఎయిర్ పోర్ట్ దగ్గర షూటింగుకి పర్మిషన్ విషయంలో ఇబ్బంది అయి తాము కార్లో వెయిట్ చేస్తుంటే.. వేరే వ్యక్తి దగ్గర మాత్రం షూటింగ్ మొదలవకపోవడానికి తానే కారణమని తమ్మారెడ్డి చెప్పడం విన్నానని చెప్పాడు రాజశేఖర్. నిజానికి ఆ సినిమాకు తన పారితోషకం ఎగ్గొట్టాలని తమ్మారెడ్డి అనుకున్నాడని.. కానీ సత్యారెడ్డి అనే దర్శకుడితో డీల్ చేయించి తమకు రావాల్సింది పట్టుబట్టి రాబట్టుకున్నామని.. ఆ కోపంతోనే ఆయన తన మీద విమర్శలు చేశారని రాజశేఖర్ తెలిపాడు.