Begin typing your search above and press return to search.

15 రోజుల‌కే అమెజాన్ లోనా? అన్యాయం!

By:  Tupaki Desk   |   26 July 2019 6:27 AM GMT
15 రోజుల‌కే అమెజాన్ లోనా? అన్యాయం!
X
60 రోజుల త‌ర్వాత‌నే డిజిట‌ల్ రిలీజ్... ఇదీ ఇటీవ‌ల టాలీవుడ్ పెద్ద‌ల్లో సాగిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. 60 రోజుల లోపు ఏదైనా సినిమా డిజిటల్ లో రిలీజ‌వ్వ‌డం స‌రికాద‌నే వాద‌నను మెజారిటీ జ‌నం వినిపించారు. కానీ ఏం లాభం..? ఇలా రిలీజైందో లేదో అలా ఆన్ లైన్ లో అందుబాటులోకి వ‌చ్చేసింది ఆ యంగ్ హీరో సినిమా. వివ‌రాల్లోకి వెళితే..

దివంగ‌త న‌టుడు రియ‌ల్ స్టార్ శ్రీ‌హ‌రి వార‌సుడు మేఘాంశ్ న‌టించిన `రాజ్ దూత్` ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. కొత్త హీరో.. ప్ర‌చారంలో వెన‌క‌బాటు.. ప‌రిశ్ర‌మ స‌పోర్ట్ కూడా లేక‌పోవ‌డం .. వెర‌సి ఈ సినిమా జ‌నాల్లోకి స‌రిగా వెళ్ల‌లేదు. కొత్త త‌రం ద‌ర్శ‌కుల తడ‌బాటుతో కంటెంట్ వీక్ అన్న చ‌ర్చ సాగింది. నాన్న గారు ఉండి ఉంటే నా ప‌రిచ‌యం వేరొక స్థాయిలో ఉండేద‌ని మేఘాంశ్ ఓ ఇంట‌ర్వ్యూలోనూ అన‌డం మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. కార‌ణం ఏదైనా `రాజ్ దూత్` ఫ్లాపవ్వ‌డం స‌ద‌రు యువ‌హీరోని నిరాశ‌ప‌రిచింది.

జూలై 12న `రాజ్ దూత్` రిలీజైంది. కేవ‌లం రెండు వారాల్లోనే అంటే జూలై 25న ఈ సినిమాని డిజిట‌ల్ లో రిలీజ్ చేసేస్తుండ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గ‌జం అమెజాన్ ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ ని చేజిక్కించుకుని రెండు వారాల‌కే లైవ్ చేసేస్తోంది. 60 రోజులు లేదా 8 వారాల త‌ర్వాత‌నే డిజిట‌ల్ లో రిలీజ్ చేయాల‌న్న నియ‌మాన్ని తుంగ‌లో తొక్కేసిన‌ట్టేనా? ఇది కేవ‌లం రాజ్ దూత్ వ‌ర‌కేనా? ఇత‌ర సినిమాల‌కు వ‌ర్తిస్తుందా? లేదూ ఫ్లాపైన సినిమాల‌కు ఆ నియ‌మం వ‌ర్తించ‌దా? అన్న‌దానిపైనా క్లారిటీ రావాల్సి ఉంది.