Begin typing your search above and press return to search.

రాజీవ్ కనకాల-సుమ.. ఒక ప్రేమకథ

By:  Tupaki Desk   |   8 Aug 2022 1:30 PM GMT
రాజీవ్ కనకాల-సుమ.. ఒక ప్రేమకథ
X
టాలీవుడ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్స్‌లో రాజీవ్ కనకాల-సుమలది ఒకటి. బుల్లితెర నుంచి ప్రయాణం మొదలుపెట్టిన వీళ్లిద్దరూ ఎవరికి వాళ్లు మంచి అవకాశాలే అందుకున్నారు.

రాజీవ్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంటే.. సుమ తెలుగులో నంబర్ వన్ యాంకర్‌గా సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతోంది. ఆమె ఇటీవల 'జయమ్మ పంచాయితీ' అనే సినిమాలోనూ నటించింది. ఐతే ఇటీవల వీరి మధ్య విభేదాలు వచ్చినట్లు, విడిపోతున్నట్లు మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి.

కానీ అలాంటిదేమీ లేదనే అనిపిస్తోంది. తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో సుమ గురించి రాజీవ్ చాలా పాజిటివ్‌గానే మాట్లాడాడు. ఈ సందర్భంగా తమ ప్రేమకథ ఎలా మొదలైందో కూడా వివరించాడు. అతనిలా మాట్లాడాడంటే వీరి బంధానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదనే భావించాలి. ఇంతకీ రాజీవ్-సుమల ప్రేమకథ ముచ్చట్లేంటో తన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

''దూరదర్శన్ కోసం ఒక షూట్ చేసినపుడు సుమను తొలిసారి చూశా. బాగానే ఉంది కదా అనుకున్నా. తర్వాత సెంట్రల్ యూనివర్శిటీలో షూటింగ్ కోసం వెళ్తే అక్కడ సుమ కనిపించింది. ఒక్క రోజులో ఎలా పడెయ్యాలి అనుకున్నా.

ఐతే అప్పుడు రెండు రోజులు చిత్రీకరణ జరిగినా ఏమీ కాలేదు. తర్వాత మీర్ దర్శకత్వంలో 'తెలుగువారి పెళ్లి' చిత్రీకరణకు వెళ్లగా అందులో పెళ్లికొడుకు నేను, నా పక్కన వేరే అమ్మాయి చేయాల్సింది. కానీ తర్వాత నాకు జోడీగా సుమను పెట్టారు. ఐదారు రోజులు పెళ్లి తంతు జరిగింది.

అప్పుడు కొంచెం పరిచయం పెరిగింది. తర్వాత 'మేఘమాల' సీరియల్లో సుమ జీడిగుంట శ్రీధర్‌కు జోడీగా నటించింది. అప్పుడు మా మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. 1999లో సుమతో పెళ్లి అయింది. సుమ మద్దతుతోనే మా కుటుంబం సంతోషంగా సాగిపోయింది. నేను షూటింగ్‌లకు వెళ్తే తనే అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది'' అని రాజీవ్ తెలిపాడు.