Begin typing your search above and press return to search.

'నీ ఇంట్లో సరిగా జరగట్లేదు.. నేను చూస్తాను అన్నట్లుంది ప్రకాష్ రాజ్ వ్యవహారం

By:  Tupaki Desk   |   6 Oct 2021 3:30 AM GMT
నీ ఇంట్లో సరిగా జరగట్లేదు.. నేను చూస్తాను అన్నట్లుంది ప్రకాష్ రాజ్ వ్యవహారం
X
ప్రస్తుతం టాలీవుడ్ లో 'మా' ఎన్నికల వ్యవహారం వాడి వేడిగా సాగుతోంది. అధ్యక్ష బరిలో దిగుతున్న ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు మరియు ప్యానెల్ సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు కు మద్దతు తెలుపుతున్నట్లు ఓపెన్ గా ప్రకటించిన నటుడు రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

''తెలుగువారు అందరినీ చాలా బాగా ఆదరిస్తారు. గెస్టుగా నా ఇంటికి వచ్చినప్పుడు చక్కగా భోజనం పెడతారు.. సకల మర్యాదలు చేస్తారు.. కానీ ఆ గెస్ట్ నా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని 'నీ ఇంట్లో వ్యవహారాలు సరిగా జరగట్లేదు.. నీ ఇంటి సంగతి నేను చూస్తాన్రా' అంటే మీరు ఒప్పుకుంటారా?'' అని ప్రకాష్ రాజ్ ను ఉద్దేశిస్తూ రాజీవ్ కనకాల కామెంట్ చేశారు. ఒక మనిషిగా ఇంకో మనిషికి ఇంత మర్యాద ఇస్తున్నప్పుడు.. ఇది లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ కాదని ఆయన అన్నారు.

''చేతులకు ఏమన్నా గాజులు తొడుక్కొని కూర్చున్నామా? అంటే నా ఇల్లు నేను సమర్థించుకోలేనా? చక్కదిద్దుకోలేనా? నాకు చేవలేదా? చేతకాదా? ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రకాష్ రాజ్ రాక అలానే ఉంది. నీ ఇంట్లో సరిగ్గా జరగడం లేదు నేనొచ్చి చేస్తా అన్నట్లు" అని రాజీవ్ కనకాల మాట్లాడారు. "ఇక్కడ చాలామంది హీరోలున్నారు. అందులో ఒక హీరో మంచు విష్ణు నేను చేస్తానని ముందుకు వచ్చాడు'' అని అన్నారు.

''యాక్ట్ చేయడానికి ఓకే. ఎవరైనా ఎక్కడి వారైనా రావొచ్చు.. నటించవచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా స్కేల్ లో సినిమాలు తీస్తున్నారు కాబట్టి లెక్కలన్నీ మారాయి. కొన్ని పాత్రల కోసం వేరే భాషల నటులను కూడా తీసుకోవాలి. అయినప్పటికీ వీలైనంత మంది తెలుగునటులకు అవకాశాలు ఇవ్వాలి. మొన్నటి దాకా కన్నడ ఇండస్ట్రీలో వేరే భాషల సినిమాలను అవకాశం ఉండేది కాదు. డబ్బింగ్ సినిమా చేయడానికి కూడా వీల్లేదు. కన్నడ సినిమా చేస్తే కన్నడ ఆర్టిస్టుల్ని మాత్రమే పెట్టుకోవాలి. వేరే భాషల డ్యాన్సర్స్ ఫైటర్స్ ను కూడా తీసుకోరు''

''అలా చేసి వాళ్ల ఇండస్ట్రీని డెవలప్ చేసుకున్నారు. మేం అంత స్టుపిడ్ కాదు. మేం అడుగుతుంది ఇక్కడి వారిలో కొందరికి అవకాశం ఇవ్వమని. ఇవాళ 900 మంది ఆర్టిస్టులున్నారు. వారిలో కనీసం 300 మందైనా పనికిరామా అనే ఉద్దేశం అంతే'' అని రాజీవ్ కనకాల అన్నారు. ఈ సందర్భంగా 'మా' ఎన్నికల్లో విష్ణు కచ్చితంగా గెలుస్తాడని రాజీవ్ ధీమా వ్యక్తం చేశారు. విష్ణు గెలిస్తే ఈజీగా ఇండస్ట్రీలో సమస్యలు పరిష్కరిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.