Begin typing your search above and press return to search.

జగపతి బాబు కాదు.. రాజేంద్ర ప్రసాద్

By:  Tupaki Desk   |   22 Sep 2015 11:30 AM GMT
జగపతి బాబు కాదు.. రాజేంద్ర ప్రసాద్
X
అవార్డులంటే ఎవరికి చేదు చెప్పండి. ఎంత సింపుల్ గా బతికే వాళ్లయినా ప్రభుత్వం నుంచి ఓ గుర్తింపు సంపాదించాలని.. ఓ అవార్డు అందుకోవాలని ఆశించడం సహజం. సినిమా వాళ్లకు కూడా ఆ ఆశ చాలానే ఉంటుంది. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించబోయే సమయానికి టాలీవుడ్ జనాలు చాలామంది ఆశగా చూస్తారు. మంచి పలుకుబడి ఉండి.. రాష్ట్ర ప్రభుత్వం కొంచెం గట్టిగా సిఫారసు చేస్తే.. పద్మ పురస్కారం ఒళ్లో వాలిపోతుంది.

ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ ప్రముఖులపై బాగానే దృష్టిపెట్టింది. మొత్తంగా నలుగురిని పద్మ పురస్కారాలకు సిఫారసు చేసింది. నటుడిగా నాలుగు దశాబ్దాల అనుభవమున్న మురళీ మోహన్ అనుకున్నట్లే పద్మభూషణ్ రేసులో నిలిచారు. ఆయన ప్రస్తుతం ఎంపీ కూడా అన్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ రంగాల్లో తాను అందించిన సేవలకు ఆయన పురస్కారం ఆశిస్తున్నారు.

పద్మశ్రీ కోసం ముగ్గురి పేర్లను సిఫారసు చేసింది ఏపీ సర్కారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ - గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి - సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ రేసులో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ ఇటీవలే ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై తన స్టేటస్ పెంచుకున్నారు. ఐతే తెలుగుదేశం ఎంపీ అయిన మురళీ మోహన్ కు వ్యతిరేకంగా ఆయన గెలుపొందిన నేపథ్యంలో అవార్డు వస్తుందో రాదో చూడాలి.

వేటూరి సుందరరామ్మూర్తి లాంటి పెద్దాయనకు ఎప్పుడో పురస్కారం దక్కాల్సింది. ఇప్పటికైనా ఆయన పేరును ప్రతిపాదించినందుకు సంతోషం. వందేమాతరం కూడా అవార్డుకు అర్హుడే. ఐతే మరో సీనియర్ నటుడు జగపతి బాబు పద్మశ్రీ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆయన పేరు జాబితాలో లేదు. జగపతి కంటే రాజేంద్ర ప్రసాదే సీనియర్ అని భావించిన ఆయన పేరు జాబితాకు ఎక్కించినట్లున్నారు.