Begin typing your search above and press return to search.

చిన్న సావిత్రి ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   20 May 2018 8:23 AM GMT
చిన్న సావిత్రి ఎవరో తెలుసా?
X
తెలుగు ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని ఇస్తోంది ‘మహానటి’ సినిమా. ఈ సినిమాలో ఎన్నెన్ని పాత్రలో? అన్నీ కూడా తమదైన ముద్ర వేశాయి. ఆయా పాత్రల్లో నటించిన నటీనటులు చక్కటి అభినయంతో వాటిని పండించారు. ఆఖరికి చిన్నప్పటి సావిత్రిగా నటించిన చిన్నమ్మాయి సైతం అదరగొట్టేసింది. తన చలాకీ నటనతో చిన్న సావిత్రి పాత్రను పండించింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఇదే సినిమాలో కేవీ చౌదరిగా కీలక పాత్రలో మెరిసిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు స్వయాన మనవరాలు. అంటే మనవరాలే ఆయనకు ఇందులో కూతురి వరసలో నటించిందన్నమాట. ఈ అమ్మాయి తన తాతయ్యతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ‘మహానటి’లో నటించిన అనుభవం గురించి చాలా చలాకీగా మాట్లాడింది.

‘‘నాగ్ అశ్విన్ అంకుల్.. స్వప్న ఆంటీ మా తాతను కలవడానికి మా ఇంటికొచ్చారు. నేను నా కుక్క ద్వారా వాళ్లను ఒకసారి భయపెట్టాను. వాళ్లకు నేను నచ్చాను. నన్ను ఈ సినిమాలో నటింపజేయొచ్చా అని మా తాతయ్యను అడిగారు. ఆయన ఓకే అనడంతో ఈ సినిమా చేశాను. నాకు కెమెరా ముందు నటించడానికి భయం వేయలేదు. మా తాతయ్య నుంచి యాక్టింగ్ నేర్చుకున్నాను. ఆయన సినిమాలు చూసి వాటిలోని డైలాగుల్ని చెప్పడం.. కొన్ని సన్నివేశాలు నటించి చూపించడం తరచుగా చేస్తుంటా’’ అని ఆ చిన్నారి అంది. ఇంతకీ నీకు సావిత్రి అంటే ఎవరు అడిగితే తెలియదని చెప్పిన ఆ అమ్మాయి.. సినిమా రిలీజయ్యాక ఆమె గురించి తనకు అర్థమైందని చెప్పడం విశేషం. ఈ నెల 9న విడుదలైన ‘మహానటి’ అద్భుతమైన టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లతో పెద్ద విజయం దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే.