Begin typing your search above and press return to search.

జక్కన్న కల సినిమాలో 'రజనీ.. కమల్ హాసన్'

By:  Tupaki Desk   |   23 March 2022 2:01 PM IST
జక్కన్న కల సినిమాలో రజనీ.. కమల్ హాసన్
X
సినీ ప్రేక్షకుల కలల సినిమాగా పేర్కొనే 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ఇంకా రెండంటే రెండు రోజులే మిగిలి ఉంది. ఈ సినిమా మీద ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. ఈ సినిమాతో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులు బద్దలైపోవటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.

తన సినిమాను ప్రమోట్ చేయటానికి దేశ సినిమా ఇండస్ట్రీలో మరెవరూ చేయని రీతిలో ప్రచారం చేసుకోవటంలో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాతే ఎవరైనా. అక్కడ.. ఇక్కడ అన్న తేడా లేకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న ఆయన.. పలు మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజమౌళికి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. తమిళ హీరోలతో మల్టీ స్టారర్ ఫిలిం చేస్తే దాన్ని ఎవరితో చేస్తారన్న ప్రశ్నకు అంతే ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు రాజమౌళి.

తనకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో.. విశ్వ నటుడు కమల్ హాసన్ తో సినిమా తీయాలని ఎప్పటి నుంచో ఉందన్నారు. అంతేకాదు.. తన కల సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని చెప్పారు.

ఈ సినిమాకు సంబంధించి ఒక ఐడియా తన మనసులో ఉందని.. పూర్తి కథ లేదు కానీ.. వారిద్దరిలో ఒకరు హీరోగా.. మరొకరు విలన్ గా ఉండాలన్నది తన ఆలోచనగా చెప్పారు. కమల్ విలన్ గా రజనీ హీరోగా కానీ.. రజనీ విలన్ గా కమల్ హీరోగా కానీ అయినా ఫర్లేదన్నారు.

అలాంటి సినిమాను చూడాలన్నది ఒక అభిమానిగా తన ఆలోచనగా చెప్పారు. అలాంటి సినిమా చేయాలన్న జక్కన్న మాటలు చూస్తే.. రానున్న రోజుల్లో ఆ కల నిజం కావాలని కోరుకుందాం. ఇలాంటి కాంబినేషన్ రాజమౌళి కాక మరెవరికి సాధ్యం కాదేమో?