Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఆసుపత్రి నుంచి రజనీ డిశ్చార్జ్

By:  Tupaki Desk   |   27 Dec 2020 11:45 AM GMT
బ్రేకింగ్: ఆసుపత్రి నుంచి రజనీ డిశ్చార్జ్
X
అధిక రక్తపోటు(బీపీ)తో శుక్రవారం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు ఆరోగ్యం కుదటపడి డిశ్చార్జ్ అయ్యారు. రజినీకాంత్ కోలుకున్నారని.. వైద్య నివేదికల్లో అన్ని నార్మల్ గా వచ్చాయని వైద్యులు చెప్పారు.

70 ఏళ్ల రజినీకాంత్ రక్తపోటులో "తీవ్రమైన హెచ్చుతగ్గులు" రావడంతో వెంటనే హైదరాబాద్ అపోలో ఆసుపత్రులో చేరాడు. "అన్నాతే" చిత్రం షూటింగ్ కోసం గత వారం ఇక్కడికి రజినీకాంత్ వచ్చాడు. చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న నలుగురు సిబ్బందికి కరోనావైరస్ సోకడంతో షూటింగ్ ను రద్దు చేశారు. ఇక రజనీకాంత్ కు సైతం కోవిడ్ టెస్టు చేయగా నెగెటివ్ వచ్చింది.

నిన్న రజినీకాంత్ ను పరీక్షించిన వైద్యులు పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవీ లేవని శనివారం ఒక మెడికల్ బులిటెన్ అప్పజెప్పారు. అయితే మరికొన్ని పరీక్షల కోసం రజినీకాంత్ ను ఆస్పత్రిలోనే ఉంచుకున్నారు. ప్రస్తుతం "రజినీకాంత్ రక్తపోటు అదుపులోకి వచ్చింది. ఆరోగ్యం స్టేబుల్ గా ఉంది. మెరుగైన వైద్య పరిస్థితి దృష్ట్యా, ఈ రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తున్నాం" అని ఆసుపత్రి ఆదివారం మధ్యాహ్నం ప్రకటన విడుదల చేసింది. అయితే రజినీకాంత్ కు వైద్యులు "కంప్లీట్ బెడ్ రెస్ట్" ఒక వారం పాటు సూచించారు. యోగా, ఎక్సర్ సైజులతో ఒత్తిడిని తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు.

రజనీకాంత్ ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ఆయన స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీపై పడబోతున్నాయి. మే 2021న జరగబోయే తమిళనాడు ఎన్నికలలో ఈ కొత్త పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. రజినీకాంత్ తోటి నటుడు కమల్ హాసన్ ఇప్పటికే తన కొత్త పార్టీ మక్కల్ నీది మయం కోసం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటికే వీరిద్దరూ పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

"రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు" అని 66 ఏళ్ల కమల్ హాసన్ క్రిస్మస్ రోజున తమిళంలో ట్వీట్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఇ పళనిస్వామి కూడా అనారోగ్యంతో ఉన్న రజినీకాంత్ తో శనివారం ఫోన్‌లో మాట్లాడి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్టు సమాచారం.