Begin typing your search above and press return to search.

రజనీ సినిమా కొత్త భాషలోకి..

By:  Tupaki Desk   |   29 Dec 2018 8:05 AM GMT
రజనీ సినిమా కొత్త భాషలోకి..
X
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే కేవలం తమిళంలో మాత్రమే విడుదల కాదు. ఇతర భాషల్లోనూ పెద్ద ఎత్తునే రిలీజ్ చేస్తారు. తెలుగులో ఇక్కడి స్టార్ హీరోల సినిమాలతో సమానంగా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తారు. హిందీలో కూడా ఆయన సినిమా పెద్ద స్థాయిలోనే రిలీజవుతుంది. ఇక మలయాళంలో తమిళ చిత్రాల్ని బాగానే చూస్తారు.. పైగా అది చిన్న రాష్ట్రం కాబట్టి మలయాళంలోకి డబ్బింగ్ చేయరు. ఐతే కన్నడనాట రజనీకి అభిమాన గణం తక్కువ కాదు. ఆయన సినిమాను అనువాదం చేసి రిలీజ్ చేస్తే చూడాలని చాలామందికి ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా కర్ణాటకలో డబ్బింగ్ సినిమాల పై నిషేధం ఉండటంతో అనువాదం చేసే అవకాశం లేకుండా పోయింది. ఒకప్పుడు డబ్బింగ్ సినిమాల కారణంగ కన్నడ చిత్రాలే ఉనికే ప్రమాదకరంగా మారుతుండటంతో ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి అనువాదాలపై నిషేధం విధించారు.

ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ నిబంధనను ఈ మధ్య సడలించేస్తున్నారు. ప్రత్యేకంగా తీర్మానం అంటూ ఏమీ చేయలేదు కానీ... ఈ మధ్య కొన్ని అనువాదాలు రిలీజైతే ఎవరూ అడ్డుకోలేదు. హాలీవుడ్ సినిమాలతో సహా కొన్ని వేరే భాషల చిత్రాలు డబ్ చేసి రిలీజ్ చేశారు. వాటిని ఎవరూ అడ్డుకోలేదు. ఈ నేపథ్యం లో డబ్బింగ్ సినిమాలకు అడ్డంకి తొలగినట్లే ఉంది. ఓవైపు ‘కేజీఎఫ్’ సినిమాను భారీ స్థాయిలో వేరే భాషల్లో రిలీజ్ చేసి.. మరో వైపు తమ రాష్ట్రంలో వేరే భాషల అనువాదాల్ని రిలీజ్ చేయనివ్వమంటే ఎలా కుదురుతుంది.

ఈ పరిస్థితిని రజనీ కొత్త సినిమా ‘పేట్ట’కు అనుకూలంగా మలుచుకుంటోంది చిత్ర నిర్మాణ సంస్థ. ఈ చిత్రాన్ని కన్నడలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారట. జనవరి 10న కన్నడ వెర్షన్ భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ‘2.0’ తమిళ వెర్షనే కన్నడనాట రూ.50 కోట్లు వసూలు చేసింది. మరి ‘పేట్ట’ను నేరుగా కన్నడలోనే రిలీజ్ చేస్తే ఏ స్థాయిలో వసూలు చేస్తుందో చూడాలి.