Begin typing your search above and press return to search.

కాలా ఇలా అయితే ఎలా

By:  Tupaki Desk   |   12 May 2018 5:30 AM GMT
కాలా ఇలా అయితే ఎలా
X
అసలు సూపర్ స్టార్ రజనికాంత్ సినిమా వస్తుంది అంటే ఎంత సందడి ఉంటుంది. విడుదలకు నెల రోజుల సమయం కూడా లేదు. కాని కాలా తాలూకు హంగామా ఎక్కడా కనిపించడం లేదు. ఆయనంటే ప్రాణమిచ్చే ఫాన్స్ తమిళనాడులో ఉన్నారు కాబట్టి అక్కడ బాగానే హడావిడి ఉంటుంది. కాని తెలుగులో మాత్రం అంత సీన్ లేదు. ధనుష్ చెబుతున్న రేట్ కు కొనడానికే మనవాళ్ళు భయపడుతున్నారు. ఇక ఆడియో విడుదలైన సంగతి ఇక్కడి వీరాభిమానులు కూడా గట్టిగా బయటికి చెప్పుకోలేని పరిస్థితి. కారణం 8 పాటలున్నా ఒక్కటంటే ఒక్కటి కూడా క్యాచీగా ఆకట్టుకునేలా లేకపోవడం. ఏదో మిడిల్ రేంజ్ హీరో డబ్బింగ్ సినిమా తరహాలో ఉన్న ఆల్బం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఇది కూడా బిజినెస్ మీద ప్రభావం చూపిస్తోంది. సంతోష్ నారాయణ్ కబాలికి ఇచ్చిందే యావరేజ్ మ్యూజిక్. దాని కంటే మెరుగ్గా ఇస్తాడు అనుకుంటే అదే బెటర్ అనిపించే అవుట్ పుట్ ఇచ్చి నిరాశపరిచాడు.

ఫైనల్ గా చూసుకుంటే కాలాకు పరిస్థితులు ఏ మాత్రం అనుగుణంగా లేవు. తెలుగు నిర్మాత ఫైనల్ కాకపోవడంతో ఆడియో వేడుక చేసేందుకు కూడా అవకాశం దొరకటం లేదు. పైగా టీజర్ కూడా ఏదో రొటీన్ మాఫియా మసాలా సినిమా అనే ఫీలింగ్ ఇవ్వడంతో హైప్ కూడా పెరగలేదు. దీనికి తోడు 2.0 లేట్ అవుతోంది కాబట్టి మధ్యలో చుట్టేసిన ఈ సినిమా విడుదల చేస్తున్నారు అనే టాక్ బలంగా ఉంది. ఇవన్ని పక్కన పెడితే కబాలి లాంటి పీడకలను ఇచ్చిన దర్శకుడు రంజిత్ పా మళ్ళి అలాంటి నేపధ్యాన్నే తీసుకోవడం గురించి ముందు నుంచి అనుమానాలు రేపుతూనే ఉంది. ఇది బాషా కాలం నాటి ట్రెండ్ కాదు. అలాంటి ఫార్ములా సినిమాలు రొటీన్ అయిపోయాయి. ఎంత సూపర్ స్టార్ అయినా సినిమాలో దమ్ము లేకపోతే కొన్న వాళ్ళకు చుక్కలు కనపడతాయని కబాలి - లింగా - విక్రమ సింహా ఋజువు చేసాయి. అయినా కూడా పదే పదే అదే తప్పు కాలా విషయంలో కూడా జరిగిందా అని భయపడుతున్నారు ఫాన్స్. ఉన్న నెల రోజుల్లో దీనికి భీభత్సమైన హైప్ ఎలా వస్తుందో కాలాకే తెలియాలి.