Begin typing your search above and press return to search.

రజినీని అలాంటి పాత్రలో చూడగలమా?

By:  Tupaki Desk   |   11 Sept 2016 7:00 PM IST
రజినీని అలాంటి పాత్రలో చూడగలమా?
X
సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఎనర్జీకి మారు పేరు. తెరమీద ఆయన కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు కుదురుగా కూర్చోవడం కష్టం. బేసిగ్గా తమిళ స్టార్ అయినా.. ఆయనంటే పడి చచ్చే అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. వాళ్లందరికీ రజినీని ఎనర్జిటిక్. ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లలో చూడటమే ఇష్టం. ఐతే పా.రంజిత్ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించాడు. రజినీని సామాన్యుడిగా చూపించబోయాడు. ఐతే రంజిత్ కుట్టిన చొక్కా రజినీకి సరిపోయినట్లుగా అనిపించలేదు. రజినీని అలాంటి నీరసమైన పాత్రలో చూసి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఫలితమే.. కబాలి బుడగ పేలిపోయింది. ఐతే రజినీ మాత్రం ‘కబాలి’ తరహా పాత్రలపై బాగానే ఇష్టం పెంచుకున్నట్లున్నారు.

ఇప్పటికే రంజిత్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటైన రజినీ.. తాజాగా ఓ ఆసక్తికర ప్రయోగంపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన మలయాళ సినిమా ‘ఒప్పం’ మీద సూపర్ స్టార్ మనసు పడ్డాడట. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. ఒక చిత్రమైన వైకల్యం ఉన్న మిడిలేజ్జ్ పాత్ర చేశాడు లాల్ ఇందులో. లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ రూపొందించిన సినిమా ఇది. గత శుక్రవారమే విడులైన ‘ఒప్పం’కు మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాకు.. మోహన్ లాల్ పాత్రకు మంచి స్పందన వస్తోంది. ఐతే ‘కబాలి’ చూశాక.. రజినీ ఈ తరహా సినిమా చేస్తే బాగుంటుందని భావించిన ప్రియదర్శన్.. తాజాగా రజినీ ఇంట్లోనే ‘ఒప్పం’ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాడట. సినిమా చూసి ప్రియదర్శన్‌ ను మెచ్చుకోవడంతో పాటు.. రీమేక్ లో నటించడంపై ఆలోచించి చెబుతానన్నాడట రజినీ. ఐతే సూపర్ స్టార్ ఇలా వైకల్యం ఉన్న పాత్రలో నటిస్తే ఆయన అభిమానులు జీర్ణించుకుంటారా అన్నదే సందేహం.