Begin typing your search above and press return to search.

అయ్యో.. రజినీ మూవీకి ఈ పరిస్థితా?

By:  Tupaki Desk   |   12 Jan 2019 11:31 AM GMT
అయ్యో.. రజినీ మూవీకి ఈ పరిస్థితా?
X
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తమిళంలో ఏ చిత్రం చేసినా కూడా తెలుగులో కూడా భారీగా వసూళ్లు సాధిస్తూ వచ్చింది. ఫ్లాప్‌ అయిన కబాలి మరియు కాల చిత్రాలు కూడా మంచి వసూళ్లను దక్కించుకున్నాయి. ఇక 2.ఓ చిత్రం గురించి చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాల స్థాయిలో 2.ఓ వసూళ్లను రాబట్టింది. రజినీకాంత్‌ కు తెలుగులో మంచి మార్కెట్‌ ఉంది. కాని తాజాగా విడుదలైన పేట చిత్రం ఆయన స్థాయిని దిగజార్చే విధంగా మారింది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా కలెక్షన్స్‌ దారుణంగా ఉన్నాయి.

సంక్రాంతికి చాలా నెలల ముందే వినయ విధేయ రామ, ఎఫ్‌ 2 చిత్రాలకు థియేటర్లు బుక్‌ చేశారు. ఎన్టీఆర్‌ కు కూడా భారీగానే థియేటర్లు బుక్‌ చేశారు. చివరి నిమిషంలో సంక్రాంతి బరిలో నిలిచిన 'పేట' చిత్రంకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కలేదు. పేట డబ్బింగ్‌ రైట్స్‌ ను 15 కోట్లకు కొనుగోలు చేసిన నిర్మాత థియేటర్లు ఇవ్వడం లేదని వివాదాన్ని కూడా రేపాడు. కాస్త పర్వాలేదు అన్నట్లుగా థియేటర్లు దక్కాయి. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ దక్కిన నేపథ్యంలో కలెక్షన్స్‌ బాగానే వస్తాయని ఆశించారు.

కాని 'పేట' మొదటి రోజు కలెక్షన్స్‌ తీవ్రంగా నిరాశ పర్చే విధంగా ఉన్నాయి. గతంలో కబాలి చిత్రంతో మొదటి రోజే 10 కోట్లను దక్కించుకున్న రజినీకాంత్‌ పేట చిత్రంతో మాత్రం కేవలం 1.5 కోట్లు మాత్రమే రాబట్టగలిగాడు. లాంగ్‌ రన్‌ లో అయినా ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తుందనే నమ్మకం లేదు. ఎందుకంటే ఒక వైపు ఎన్టీఆర్‌ మరో వైపు ఎఫ్‌ 2 చిత్రాలు దుమ్ము రేపుతు కలెక్షన్స్‌ వసూళ్లు చేస్తున్నాయి. దాంతో పేటకు లాంగ్‌ రన్‌ బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందనే నమ్మకం ట్రేడ్‌ వర్గాల్లో కనిపించడం లేదు.