Begin typing your search above and press return to search.

రాజకీయ పార్టీ పెట్టడం లేదు.. క్షమించండి:రజినీకాంత్!

By:  Tupaki Desk   |   29 Dec 2020 7:10 AM GMT
రాజకీయ పార్టీ పెట్టడం లేదు.. క్షమించండి:రజినీకాంత్!
X
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఊహించలేని భారీ షాక్ ఇచ్చారు. మరో రెండు రోజుల్లో రజినీ నోటి వెంట తీపి కబురు కోసం ఎదురుచూస్తున్న అభిమానులకి షాక్ ఇస్తూ రాజకీయ అరంగేట్రం పై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి వస్తానని గతంలో ప్రకటించిన రజినీకాంత్... తాజాగా ఈ విషయంలో వెనక్కి తగ్గారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన ఉండదని స్పష్టం చేశారు.

తన ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పారు. రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. పార్టీ కోసం ఎదురు చూసిన అభిమానులందరికీ క్షమాపణ చెపుతున్నానని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను రోడ్డు మీదకు వస్తే.. అది తన ఆరోగ్యానికే ముప్పుగా మారే అవకాశం ఉందని చెప్పారు. రాజకీయాల్లో ప్రవేశంపై మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం తన అభిమానులతోపాటు ప్రజలకు నిరాశ కలిగిస్తుందనే విషయం తనకు తెలుసన్న రజినీకాంత్.. ఈ విషయంలో అభిమానులు తనను క్షమించాలని వారిని కోరారు.

ఈ నెల 31న కొత్త పార్టీని ప్రకటించనున్నామని రజనీ తెలిపారు. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన పార్టీని ప్రకటించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు. తన అనారోగ్యం కారణంగా తాను నటిస్తున్న అన్నాత్తై సినిమా షూటింగ్ ఆగిపోయిందని.. ఈ కారణంగా చాలామంది తమ ఉపాధి కోల్పోయారని రజినీకాంత్ అన్నారు. ఒకవేళ తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ప్రజలను కలవాల్సి ఉంటుందన్న రజినీకాంత్.. ఒకవేళ తనకు ఏమైనా జరిగితే తనను నమ్మకున్న వాళ్లు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ప్రశాంతత కోల్పోతారని అన్నారు. ఇటీవలే హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. తీవ్రమైన బీపీ హెచ్చుతగ్గులతో ఆయన బాధపడ్డారు. ఈ నేపథ్యంలో, ఎంతో ఒత్తిడి ఉండే రాజకీయాలు వద్దని ఆయన కుమార్తె ఐశ్వర్యతో పాటు ఇతర కుటుంబసభ్యులు ఆయనను కోరారు. దీంతో, ఆయన పార్టీ పెట్టే యోచనను విరమించుకున్నారు.