Begin typing your search above and press return to search.

రజినీ చదివిన స్కూల్.. షేపులు మారిపోయాయి

By:  Tupaki Desk   |   25 March 2018 9:30 AM GMT
రజినీ చదివిన స్కూల్.. షేపులు మారిపోయాయి
X
పై చిత్రంలోని భవనం చూశారా..? అదేదో కార్పొరేట్ సంస్థకు సంబంధించిన బిల్డింగ్ లాగా ఉంది కదూ..? అది ఒక ప్రభుత్వ పాఠశాల భవనం అంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. దక్షిణ బెంగళూరులోని గవిపురకి సమీపంలో ఉందీ పాఠశాల. సూపర్ స్టార్ రజినీకాంత్ చదువుకున్నది ఈ పాఠశాలలోనే కావడం విశేషం. శివాజీ రావు గైక్వాడ్ పేరుతో ఇక్కడే ఆయన ఐదేళ్ల పాటు ప్రాథమిక తరగతులు చదువుకున్నారు.

1943 ప్రాంతంలో నిర్మించిన చాలా ఏళ్ల కిందటే శిథిలావస్థకు చేరుకుంది. మరమ్మతులకు నోచుకోకపోవడం అది చివరికి మూతపడింది. ఐతే యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పాఠశాల గురించి ఆయన దృష్టికి వచ్చింది. అప్పట్లో ఆయన సర్కారు రూ.18 లక్షలు మరమ్మతుల కోసం కేటాయించారు ఆ తర్వాత సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి నిధులు మంజూరు చేసింది. మొత్తంగా రూ.1.7 కోట్ల దాకా ఖర్చు చేసి ఈ పాఠశాల రూపు రేఖలే మార్చేశారు.

కార్పొరేట్ స్కూల్ తరహాలో దీన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దారు. తరగది గదులకు మంచి సౌకర్యాలు కల్పించారు. ఇందులో ఆకర్షణీయమైన ఆట మైదానం - స్మార్ట్ బోర్డులు - విద్యార్థుల కోసం ఆడియో-విజువల్ ల్యాబ్ సదుపాయం సహా పలు ఆధునిక సదుపాయాలున్నాయి. ఈ పాఠశాల సోమవారం నుంచే పున:ప్రారంభం కానుంది. రజినీకాంత్ చెన్నైలో ఉండుంటే ఆయన్ని ఈ వేడుకకు పిలవాలనుకున్నారు కానీ.. ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు సమాచారం.