Begin typing your search above and press return to search.

రజినీ.. నీకీ వ్యాఖ్యలు తగునా?

By:  Tupaki Desk   |   10 April 2017 9:28 AM GMT
రజినీ.. నీకీ వ్యాఖ్యలు తగునా?
X
సూపర్ స్టార్ రజినీకాంత్ లాస్ట్ మూవీ ‘కబాలి’లో నిప్పురా తాకరా చూద్దాం అంటూ ఓ పాట ఉంటుంది. ఈ పాటను రజినీ సినిమాకు చక్కగా అన్వయించుకోవచ్చు. ఆయన సినిమా అంటే బయ్యర్లకు నిప్పుతో చెలగాటం లాగే ఉంటోంది మరి. ‘రోబో’ తర్వాత రజినీ చేసిన సినిమాలన్నీ బయ్యర్లను నిండా ముంచేసినవే. కథానాయకుడు.. విక్రమసింహా.. లింగా.. కబాలి.. అటు తమిళంలో.. ఇటు తెలుగులో చేదు అనుభవాల్నే మిగిల్చాయి. ఈ సినిమాలన్నింటికీ హైప్ బాగా వచ్చింది. బయ్యర్లు భారీ పెట్టుబడి పెట్టారు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర చతికల పడి బయ్యర్లను ముంచాయి.

గతంలో కొన్ని సినిమాలకు బయ్యర్లను ఆదుకున్న రజినీ.. ఈ మధ్య ఆ అలవాటును పక్కనపెట్టేశాడు. బయ్యర్ల ఊసే ఎత్తట్లేదు. వారిని పట్టించుకోకపోగా.. తప్పంతా బయ్యర్లదే అన్నట్లుగా ఇటీవలే ఓ తమిళ సినిమా ఆడియో వేడుకలో రజినీ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఒక సినిమాకు వచ్చిన హైప్ ను చూసి ఎంత పడితే అంత రేటుకు కొనొద్దని.. ఈ విషయంలో అనుభవజ్నుల సలహా తీసుకోవాలని రజినీ సూచించాడు. సినిమా మీద మరీ ఎక్కువ రేటు పెట్టి.. విడుదల తర్వాత ఏడ్చి ప్రయోజనం లేదని రజినీ పేర్కొనడం విశేషం. ఈ వ్యాఖ్యలు రజినీ సినిమాలు కొని నష్టపోయి.. ఆ తర్వాత పరిహారం కోరి డిస్ట్రిబ్యూటర్లను ఉద్దేశించి చేసినవే అనడంలో సందేహం లేదు. ఐతే తన సినిమాలకు నిర్మాతలు లేని పోని హైప్ తేవడం.. సినిమాను తక్కువలో పూర్తి చేసిన అయినకాడికి అమ్మేయడం.. బయ్యర్ల ఉత్సాహం చూసి రేట్లు ఇష్టానుసారం పెంచుకుపోవడం.. తన పారితోషకం మరీ టూమచ్ గా ఉండటం.. ఇలాంటివేవీ రజినీకి కనిపించకపోవడం.. కేవలం బయ్యర్లదే తప్పు అన్నట్లు మాట్లాడటం విడ్డూరమే కదా. రజినీ లాంటి వాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/