Begin typing your search above and press return to search.

నాపై ఉంచిన న‌మ్మ‌కం వ‌మ్ము చేయ‌ను!

By:  Tupaki Desk   |   9 Dec 2019 8:56 AM GMT
నాపై ఉంచిన న‌మ్మ‌కం వ‌మ్ము చేయ‌ను!
X
సూపర్ స్టార్ రజినీకాంత్- ఏఆర్‌ మురుగదాస్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌జ‌నీ ఓ ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం అన్ని రకాల కమర్షియల్ హంగుల‌తో తెర‌కెక్కుతోంది. 2020 సంక్రాంతి బ‌రిలో ద‌ర్బార్ ట్రీట్ అదిరిపోవ‌డం ఖాయ‌మ‌ని టీమ్ ప్ర‌చారం చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.బి. ప్ర‌సాద్ బృందం రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఆడియో రిలీజైంది.

ఈ వేడుక‌లో ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ చేసిన ఓ వ్యాఖ్య ఆస‌క్తిని రేకెత్తించింది. అస‌లు న‌న్ను న‌మ్మిన వారి న‌మ్మ‌కాన్ని ఏనాడూ వ‌మ్ము చేయ‌లేద‌ని ర‌జ‌నీ ఆడియో వేదిక‌పై వ్యాఖ్యానించారు. మంచి వ్యక్తులు అందరూ మంచి మనసుతో మంచి సమయంలో కలిసి చేసిన సినిమా ఇది. మంచి సమయంలోనే రిలీజ్ అవుతుంది. నేను త‌మిళ‌నాడుకి వ‌చ్చేటప్పుడు నాపై న‌మ్మ‌కంతో ప్రోత్స‌హించిన వారికి.. నాపై న‌మ్మ‌కంతో సినిమాలు రూపొందించిన ద‌ర్శ‌క నిర్మాత‌లు అంద‌రి విష‌యంలో నేను న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌లేదు. ఇప్పుడు `ద‌ర్బార్‌`తో మీ న‌మ్మ‌కాన్ని వమ్ము చేయ‌ను`` అని ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు.

ఆడియోలో ర‌జ‌నీ మాట్లాడుతూ ``సుభాస్క‌ర‌న్ నాకు మంచి స్నేహితుడు. ఆయ‌న లండన్ లో పెద్ద బిజినెస్ మేన్ అయినా ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రికో ఉపాధినివ్వాల‌ని స‌మాజానికి సేవ చేస్తున్నాడు. 2.0 సినిమా చేసే సమయంలో మా బ్యానర్ లో మరో సినిమా చేయాల‌ని ఆయ‌న‌ నన్ను అడ‌గ‌డంతో నేను కాద‌న‌లేదు. మురుగ‌దాస్ నా ఆలోచ‌న‌లోకి రావ‌డంతో ద‌ర్బార్ మొద‌లు పెట్టాం. కొన్ని కార‌ణాల వ‌ల్ల గ‌తంలో చేయాల‌నుకున్నా చేయ‌లేక‌పోయాం. ఇక `కబాలి`, `కాలా` సినిమాలు చేసే సమయంలో ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కథతో సినిమా చేస్తానన్నాడు మురుగ‌దాస్‌. అయితే `పేట` చిత్రంలో నన్ను చూసి మీరు ఇలాంటి క్యారెక్టర్స్‌ చేస్తారని తెలిసి ఉంటే నేను అద్భుతమైన సినిమా చేసేవాడిని క‌దా! అని ఒక వారంలోనే `దర్బార్` కథతో నా దగ్గరకు వచ్చాడు. అలా ఈ సినిమా ప్రారంభమైంది`` అని తెలిపారు.

``చ‌క్క‌ని సామాజిక సందేశం అందించే సినిమాలు చేశారు మురుగ‌దాస్. త‌న‌తో ప‌ని చేయ‌డం ఆనందంగా ఉంది. ఈసారి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌య‌త్నించాం. ఇందులోనూ అన్ని హంగులుంటాయి. అలాగే సినిమాటోగ్రాఫర్ సంతోశ్ శివ‌న్‌ తో ద‌ళ‌ప‌తి త‌ర్వాత 29 ఏళ్లకు క‌లిసి ప‌నిచేశాను. ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా ఇది. వర్షాల కారణంగా సినిమా షెడ్యూల్ ఆలస్యమైంది. అయితే ఈ సినిమాను మురుగ‌దాస్ 90 రోజుల్లోనే పూర్తి చేశారు. ఆయ‌న‌ కాకుండా మ‌రెవరున్నా ఈ సినిమాను అంత క్వాలిటీగా- త్వ‌ర‌గా పూర్తి చేయ‌లేరు. అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. `పేట` కంటే ఈ సినిమాలో పాట‌లు బావున్నాయి`` అని ర‌జ‌నీ తెలిపారు.