Begin typing your search above and press return to search.
డబ్బు, పేరు ప్రఖ్యాతలు సంతోషాన్నివ్వవు: రజనీ
By: Tupaki Desk | 28 Oct 2017 10:15 AM GMTతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ - విలక్షణ దర్శకుడు శంకర్ ల కాంబోలో ప్రతిష్మాత్మకంగా తెరకెక్కిన ‘రోబో 2.ఓ’ ఆడియో వేడుక నిన్న దుబాయ్ లో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తలైవా వేదాంత ధోరణిలో ప్రసంగించారు. దేవుడి దయ - ప్రజల ఆశీస్సుల వల్లే తన సినీ కెరీర్ ను ఆస్వాదించగలిగానని రజనీ అన్నారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చి నాలుగైదు రోజులయినట్లుదని, తన నటజీవితం చాలా త్వరగా గడిచిపోయిందన్నారు. కెరీర్ ప్రారంభంలో డబ్బు - పేరు ప్రఖ్యాతులన్నీ కావాలనిపిస్తుందని, అయితే ఓ దశ దాటిన తర్వాత అవి ఎలాంటి సంతోన్ని ఇవ్వవన్నారు. కానీ, అవి లేకపోతే మనం దురదృష్టంగా భావిస్తామని, ఆ విషయాన్ని తలచుకుంటే నవ్వొస్తోందన్నారు. మంచి సినిమాలను - మంచి నటీనటులను ఎప్పుడూ ప్రోత్సహించాలని - సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దని కోరారు.
ఈ వేడుక సందర్భంగా రజనీకాంత్ ను బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ప్రజల్లో అసహనం - ద్వేషం - అసూయ పెరగడానికి కారణం చెప్పమని రజనీని కరణ్ ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరూ తమ స్వదేశాన్ని - భాషను ప్రేమిస్తారని, వినయంగా, అణకువతో నడుచుకుంటేనే తనకిష్టమని తలైవా అన్నారు. నేటి యువతరం సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోవడం విచారకరమన్నారు. ఈ షో తెలుగు వెర్షన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాణా...రజనీని అభిమానుల కోసం తెలుగులో ఓ డైలాగ్ చెప్పమని కోరారు. రజనీ తెలుగులో ఏది చెప్పినా అందంగా ఉంటుందన్నారు. దీంతో, రజనీ ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’ అంటూ బాషా సినిమాలోని డైలాగ్ చెప్పారు. దీంతో ఆ వేదిక ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఈ వేడుకకు రజనీ సతీమణి లత - హీరో ధనుష్ - కుమార్తెలు - సౌందర్య - ఐశ్వర్యలు పాల్గొన్నారు. తన భర్తను చూస్తుంటే గర్వంగా ఉందని, ‘2.ఓ’కోసం ఆయన పడిన శ్రమకు - చూపిన అంకితభావానికి నిజంగా సెల్యూట్ చేయాలని లత అన్నారు. ఈ చిత్రం కోసం ఎంతో శ్రమించిన అమీ - రెహమాన్ - శంకర్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయటం వల్లే ఈ సినిమా సాధ్యమైందన్నారు.