Begin typing your search above and press return to search.

కూతురి దర్శకత్వంలోనే సూపర్ స్టార్..?

By:  Tupaki Desk   |   2 Nov 2022 2:30 AM GMT
కూతురి దర్శకత్వంలోనే సూపర్ స్టార్..?
X
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన 169వ చిత్రం ''జైలర్'' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. 'డాక్టర్' ఫేమ్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'అన్నాత్తే' తర్వాత సన్‌ పిక్చర్ బ్యానర్ లో కళానిది మారన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత మరో రెండు ప్రాజెక్ట్స్ కు రజినీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ కోసం రజినీకాంత్ రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. నవంబర్ 5న చెన్నైలో జరిగే వేడుకలో ఒకేసారి ఈ రెండు ప్రాజెక్ట్స్ ను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే 'తలైవర్ 170' మరియు 'తలైవర్ 171' చిత్రాలకు దర్శకులు మరియు ఇతర వివరాలేవీ ప్రకటించబడలేదు.

దీంతో లైకా వారు నిర్మించే ఈ రెండు ప్రతిష్టాత్మక చిత్రాలకు దర్శకులు ఎవరనే దానిపై అప్పటి నుంచి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అందులో ఒక చిత్రానికి 'డాన్' ఫేమ్ శిబి చక్రవర్తి దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మరో ప్రాజెక్ట్ కు సూపర్ స్టార్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

'3' చిత్రంతో డైరెక్టర్ గా అరంగేట్రం చేసిన ఐశ్వర్య రజినీకాంత్ .. ఆ తర్వాత 'వాయ్ రాజా వాయ్' అనే సినిమాకి తెరకెక్కించింది. ఇదే క్రమంలో 'సినిమా వీరన్' అనే డాక్యుమెంటరీ రూపొందించింది. దీనికి రజినీ కాంత్ వాయిస్ అందించారు. అయితే ఇప్పుడు ఐశ్వర్య దర్శకురాలిగా తన మూడో సినిమా కోసం తండ్రి రజినీ కాంత్ తో జత కట్టనుందని.. అది కూడా 'తలైవర్170' సినిమా కోసమే అని నివేదికలు పేర్కొన్నాయి.

ఇప్పటికే చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడియాన్' అనే యానిమేషన్ సినిమాలో రజినీ కాంత్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తొలిసారి నటించడానికి తలైవా రెడీ అయ్యారని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే ఈ శనివారం (నవంబర్ 5) వరకూ వేచి చూడాల్సిందే. ఎందుకంటే అదే రోజున రజినీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను లాంచ్ చేయనున్నారు.

ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్.. తలైవర్ 170 మరియు 171 చిత్రాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. 'కాలా' '2.0' 'దర్బార్' సినిమాల తర్వాత రజినీ కాంత్ తో ఈ రెండు చిత్రాల కోసం కలుస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2023 ద్వితీయార్థంలో ఒకటి.. వచ్చే ఏడాది చివర్లో లేదా 2024 ప్రారంభంలో మరొక సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. 'అన్నాత్తే' బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో.. రాబోయే సినిమాతో తలైవా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.