Begin typing your search above and press return to search.

‘కాలా’కు బిజినెస్ కాలేదా?

By:  Tupaki Desk   |   5 Jun 2018 9:18 AM GMT
‘కాలా’కు బిజినెస్ కాలేదా?
X
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే చాలు బయ్యర్లలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తమిళనాటే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన సినిమా కోసం బయ్యర్లు ఎగబడతారు. రజనీ సినిమాలతో తరచుగా ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే.. ప్రతిసారీ మళ్లీ హైప్ వస్తుంది. బయ్యర్లు ముందు వెనుక చూడకుండా సినిమాను కొనేస్తుంటారు. కానీ ఆయన కొత్త సినిమా ‘కాలా’ విషయంలో మాత్రం ఇలాంటి వేలం వెర్రి ఏమీ కనిపించలేదు.

‘కబాలి’ దెబ్బకు కుదేలైన బయ్యర్లు.. ఇంకోసారి అదే కాంబినేషన్లో సినిమా అనేసరికి వెనక్కి తగ్గారట. ‘కబాలి’కి రూ.35 కోట్ల దాకా బిజినెస్ జరగడం విశేషం. కానీ ‘కాలా’ను రూ.25 కోట్లకు కొనడానికి కూడా ఆసక్తి చూపించలేదట బయ్యర్లు. రజనీ మరో సినిమా ‘2.0’ హక్కులకు విపరీతమైన డిమాండ్ రావడం చూసిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ.. ‘కాలా’కు కూడా బాగానే డిమాండ్ ఉంటుందని ఆశించిన భారీ రేట్లు చెప్పిందట బయ్యర్లకు. ఆ సంస్థే ఈ చిత్రాన్ని కూడా తెలుగులో రిలీజ్ చేస్తోంది. కానీ బయ్యర్ల నుంచి చప్పుడే లేకపోవడంతో రేట్లు తగ్గించుకుంటూ వచ్చింది. అయినా కూడా స్పందన అంతంతమాత్రంగా ఉండటంతో సొంతంగా రిలీజ్ చేసుకోవడానికి రెడీ అయింది.

ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు.. ఎన్వీ ప్రసాద్ కలిసి అడ్వాన్స్ ఒప్పందం మేరకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వాళ్లు కమిషన్ మాత్రమే తీసుకుంటారు. సినిమా ఫలితంతో వాళ్లకు సంబంధం ఉండదు. నష్టాలొస్తే నిర్మాతలే భరించాల్సి వస్తుంది. అందుకే ఇంతకుముందు ఏ సినిమాకూ లేని విధంగా ‘కాలా’ను ప్రమోట్ చేయడానికి రజనీ చాలా శ్రద్ధ చూపించాడు. ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా చేశారు. మరి వీళ్ల ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.