Begin typing your search above and press return to search.

రజినీకి ఈ తలపోటు అవసరమా?

By:  Tupaki Desk   |   15 May 2017 6:54 AM GMT
రజినీకి ఈ తలపోటు అవసరమా?
X
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. అభిమానులతో ఆయన నిర్వహిస్తున్న సమావేశం లేని పోని వివాదాలకు దారి తీస్తోంది. ఈ సమావేశంలో పాల్గొనడం కోసం రిజిస్టర్ అయి ఉన్న అభిమానులకు ఉచితంగా టోకెన్స్ ఇస్తున్నారు. ఆ టోకెన్లను అభిమానల సంఘాల నాయకులు భారీ రేట్లు పెట్టి అమ్ముకుంటున్నారట. ఇలా టోకెన్స్ కొన్న 300 మంది అభిమానులు రజినీ ఇంటిముందుకు వచ్చి ఆందోళనకు దిగారు. తమకు రజినీతో సెల్ఫీ దిగే అవకాశం కల్పించాలని.. లేదంటే సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడతామని వాళ్లు బెరదించడం గమనార్హం. అభిమానులకు ఉచితంగా ఇవ్వాల్సిన టోకెన్లను కొందరు అమ్మి సొమ్ము చేసుకున్నారని వారు ఆరోపించారు.

రజినీ ఏడేళ్ల విరామం తర్వాత తన అభిమానుల్ని కలిసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాడు. చెన్నైలోని తన రాఘవేంద్ర కళ్యాణ మండపంలో సోమవారం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు వేలాది మంది అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నాడు రజినీ. ఇది కొన్ని నెలల కిందటే జరగాల్సిన సమావేశం. ఐతే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. రజినీ అభిమానుల్ని ఇలా ప్రత్యేకంగా కలుస్తున్నాడంటే.. అది రాజకీయ అరంగేట్రం కోసమే అని అంతా అనుకున్నారు. ఐతే రజినీ అలాంటిదేమీ కాదని.. అభిమానుల్ని కలిసి చాలా కాలం కావడం వల్లే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించాడు.

రజినీ రాజకీయ అరంగేట్రం గురించి ఎవ్వరూ ప్రశ్నలు వేయకూడదని ఈ సమావేశానికి హాజరయ్యే అభిమానులకు షరతు విధించడం గమనార్హం. ఆ సంగతెలా ఉన్నా.. రజినీతో ఫొటోలు.. సెల్ఫీలు దిగాలని వేలాది మంది ఆశతో ఉన్న నేపథ్యంలో రజినీకి అంత ఓపిక ఉంటుందా.. ఆయన అభిమానుల్ని ఎలా మేనేజ్ చేస్తారో అన్న సందేహాలు నెలకొంటున్నాయి. అసలే ఆరోగ్యం సరిగా లేని రజనీ.. ఫ్యాన్ మీట్ పేరుతో ఆయన లేని పోని తలనొప్పులు తెచ్చుకుంటున్నాడని చెన్నై జనాలు అంటున్నారు.