Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ వల్లే డైరెక్టర్‌ నయ్యా...

By:  Tupaki Desk   |   24 Aug 2015 10:01 AM GMT
ఎన్టీఆర్‌ వల్లే డైరెక్టర్‌ నయ్యా...
X
దర్శకుడవ్వాలనే కోరిక బాగానే ఉంటుంది కానీ, ఆ అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. కొందరికి వెంటనే పనైపోతుంది. మరికొందరికి దశాబ్ధం పూర్తయినా ఎదురు చూడాల్సివస్తుంది. గీతాంజలి ఫేం రాజ్‌ కిరణ్‌ దాదాపు 15 సంవత్సరాల పాటు టాలీవుడ్‌ లో ఉన్నారు. వి.ఆర్‌.ప్రతాప్‌ వంటి సీనియర్‌ తో కలిసి కోడైరెక్టర్‌ గా పనిచేశారు. గీతాంజలి చిత్రంతో టైటిల్స్‌ లో దర్శకుడిగా పేరు పడింది. తొలి సినిమాతో హిట్‌ కొట్టి.. ఇప్పుడు స్వాతి నాయికగా త్రిపుర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రాజ్‌ కిరణ్‌. ఈ సందర్భంగా లైఫ్‌ స్ట్రగుల్‌ గురించి చాలా చెప్పారు.

డైరెక్టర్‌ అన్న పేరు టైటిల్స్‌ లో రావడానికి నాకు ఇన్నేళ్లు వేచి చూడాల్సొచ్చింది. గీతాంజలి కథ పట్టుకుని ఎంతోమంది నిర్మాతల్ని కలిశాను. చూద్దాం, చేద్దాం అన్నవాళ్లే. చివరికి కోన వెంకట్‌ కి కథ నచ్చి తనే నిర్మించడానికి ముందుకొచ్చారు. నేను మొదటి సినిమాకి దర్శకత్వం వహించడానికి కోన ఎంతో సాయం చేశారు. ఆయన కేవలం రచయిత మాత్రమే కాదు, మేకింగ్‌ కి సంబంధించిన బోలెడన్ని టెక్నికాలిటీస్‌ తెలిసిన రచయిత. అతడి సాయం మర్చిపోలేను.

అయితే నేను కెరీర్‌ ప్రారంభించిన తొలినాళ్లలో మొదటిసారి కలిసి ప్రోత్సహించిన హీరో జూ.ఎన్టీఆర్‌. 2001లోనే ఆయన్ని కలిశాను. నీలో దర్శకుడయ్యే క్వాలిటీస్‌ ఉన్నాయి. ఓ మంచి కథ తీసుకురా.. అని అడిగేవారు. ఓ పెద్ద నిర్మాతని కలవమని కూడా చెప్పారు తను. కానీ ఆరోజు నాకు పరిశ్రమలో నాకు పెద్దగా కాంటాక్ట్స్‌ లేవు. ఏదేమైనా నేను ఈరోజు దర్శకుడిని అయ్యానంటే ఎన్టీఆర్‌ ప్రోత్సాహం వల్లే.