Begin typing your search above and press return to search.

ఆస్కార్ రేసు నుంచి ఇండియా ఔట్

By:  Tupaki Desk   |   15 Dec 2017 10:49 AM GMT
ఆస్కార్ రేసు నుంచి ఇండియా ఔట్
X
ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఆస్కార్ అవార్డు అందుకోవాలని ఇండియన్ ఫిలిం మేకర్స్ దశాబ్దాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫలితం ఉండట్లేదు. ప్రతిసారీ ఎన్నో ఆశలతో ఇండియాలో తయారయ్యే వందల సినిమాల్లోంచి ఒక ఉత్తమ చిత్రాన్ని తీసి.. ఆస్కార్ అవార్డుకు పంపడం.. అది ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురవడం మామూలైపోయింది. ఈసారి కూడా కథ మారలేదు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుకు ఇండియన్ ఎంట్రీగా పంపిన ‘న్యూటన్’ సినిమా తిరుగుముఖం పట్టింది. ప్రాథమిక దశలోనే ఈ సినిమా ఔట్ అయింది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ప్రిలిమనరీ నామినేషన్ కోసం ఎంపిక చేసిన తొమ్మిది సినిమాల్లో ‘న్యూటన్’కు చోటు దక్కలేదు.

చిలీ.. జర్మనీ.. హంగేరీ.. ఇజ్రాయెల్.. లెబనాన్.. రష్యా.. సెనెగల్.. దక్షిణాఫ్రికా.. స్వీడన్ దేశాల నుంచి వచ్చిన సినిమాలను ప్రిలిమినరీ నామినేషన్ కోసం ఆస్కార్ జ్యూరీ ఎంపిక చేసింది. వీటి నుంచి తుది ఐదు సినిమాల్ని జనవరి 23న ప్రకటిస్తారు. 90వ ఆస్కార్ అవార్డులు మార్చి 18న జరగబోతున్నాయి. యువ కథానాయకుడు రాజ్ కుమార్ రావును కథానాయకుడిగా పెట్టి దర్శకుడు అమిత్ మస్రుకర్ ‘న్యూటన్’ సినిమాను రూపొందించాడు. ‘దృశ్యం ఫిలిమ్స్’ బేనర్ మీద మనీష్ ముంద్రా ఈ చిత్రాన్ని రూపొందించాడు. నక్సల్ ప్రభావం ఉన్న ప్రాంతంలో ఒక ఎలక్షన్ కమిషన్ అధికారి ఎన్నికలు జరిపించడానికి చేసే ప్రయత్నం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటిదాకా ఇండియా నుంచి ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడ్డ సినిమాల్లో ఒక్క ‘లగాన్’ మాత్రమే తుది ఐదు సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది.