Begin typing your search above and press return to search.

పద్మావతి ట్రైలర్ వేశారని..

By:  Tupaki Desk   |   21 Nov 2017 10:46 AM GMT
పద్మావతి ట్రైలర్ వేశారని..
X
పద్మావతి సినిమా అసలెప్పుడు విడుదలవుతుందో.. అసలు విడుదలవుతుందో లేదో కూడా తెలియదు. కానీ ఈ లోపు ఈ సినిమాకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలోనే ఆందోళనలు సాగుతున్నాయి. ఓవైపు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటిస్తుండగానే.. ‘పద్మావతి’ ఎప్పుడు విడుదలైనా తమ రాష్ట్రాలో ఆడదంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన చేసి షాకిచ్చాడు. మరోవైపు పంజాబ్.. జమ్ము-కాశ్మీర్ రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం విడుదల కావడం కష్టమే అంటున్నారు. రాజస్థాన్లోనూ పరిస్థితి కష్టంగానే ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమా పట్ల ఎంత వ్యతిరేకతతో ఉన్నారో చెప్పడానికి ఇంకో ఉదంతం ఉదాహరణగా నిలిచింది.

ఉత్తర ప్రదేశ్‌ లోని ఒక ప్రాంతంలో ఓ సినిమా ప్రదర్శన సందర్భంగా మధ్యలో ‘పద్మావతి’ ట్రైలర్ ప్రదర్శించినందుకే నానా భీభత్సం చేశారు. వెంటనే సమాచారం అందుకున్న కర్ణిసేన కార్యకర్తలు హుటాహుటిన థియేటర్ దగ్గరికి వచ్చి.. దాన్ని ధ్వంసం చేసినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. యాదృచ్ఛికంగా ‘పద్మావతి’ ట్రైలర్ ప్రదర్శించినందుకే రియాక్షన్ ఇలా ఉంటే.. ఇక సినిమా విడుదలైతే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అంచనా వేయొచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉన్నపుడు ఏ రాష్ట్రం మాత్రం సినిమా విడుదలకు ఓకే చెబుతుందన్నది సందేహమే. మొత్తానికి ‘పద్మావతి’కి మున్ముందు మరింత ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు. ఇలా ఒక్కో రాష్ట్రం ‘పద్మావతి’ని నిషేధిస్తూ పోతే ఆ సినిమా ఎలా రిలీజవుతుందో ఏమో?