Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘రాజుగాడు’

By:  Tupaki Desk   |   1 Jun 2018 4:44 PM GMT
మూవీ రివ్యూ: ‘రాజుగాడు’
X
చిత్రం : ‘రాజుగాడు’
నటీనటులు: రాజ్ తరుణ్ - అమైరా దస్తూర్ - రాజేంద్ర ప్రసాద్ - సితార - రావు రమేష్ - సుబ్బరాజు - నాగినీడు - కృష్ణ భగవాన్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
ఛాయాగ్రహణం: రాజశేఖర్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సంజనా రెడ్డి

కెరీర్ ఆరంభంలో వరుస విజయాలందుకుని మంచి ఊపుమీద కనిపించిన రాజ్ తరుణ్.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో వెనుకబడ్డాడు. ఈ ఏడాది సంక్రాంతికి ‘రంగులరాట్నం’తో చేదు అనుభవం ఎదుర్కొన్న రాజ్.. ఇప్పుడు తన ఆశలన్నీ ‘రాజు గాడు’ మీదే పెట్టుకున్నాడు. కొత్త దర్శకురాలు సంజనా రెడ్డి రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రాజు (రాజ్ తరుణ్) చిన్నప్పట్నుంచి తనకు తెలియకుండానే దొంగతనాలు చేసే క్లెప్టోమేనియా అనే జబ్బుతో బాధపడుతుంటాడు. దీని వల్ల అతడికి.. అతడి కుటుంబానికి చాలా ఇబ్బందులు తలెత్తుతుంటాయి. రాజు యుక్త వయసులోకి వచ్చాక ఈ సమస్య మరింత పెరుగుతుంది. రాజును ఇష్టపడ్డ ఓ అమ్మాయి కూడా అతడి తీరు నచ్చక అసహ్యించుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత రాజు.. నిత్య (తన్వి) అనే మరో అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయికీ ఇతను నచ్చుతాడు. కానీ తన జబ్బు గురించి చెప్పకుండా మేనేజ్ చేస్తుంటాడు. ఇంకోవైపు తన జబ్బు వల్ల చేసిన ఓ పొరబాటుతో ఉగ్రవాదుల టార్గెట్ అవుతాడు రాజు. ఈ నేపథ్యంలో తర్వాత అతడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.. వాటిని ఎలా పరిష్కరించుకుని తన్విని తన దాన్నెలా చేసుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఒక ఫన్నీ ఐడియాకు ఎగ్జైట్ అయిపోయి సరైన కసరత్తు లేకుండా సినిమా తీసేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ‘రాజు గాడు’ ఉదాహరణ. తన ప్రమేయం లేకుండా దొంగతనాలు చేసేసే కుర్రాడి కథ ఇది. ఆ పాయింట్ వినడానికి బాగానే అనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా తీసినపుడు టీజర్.. ట్రైలర్ కూడా బాగానే కట్ చేయొచ్చు. హీరో పాత్ర స్వభావాన్ని చెబుతూ కొన్ని సన్నివేశాలతో ఫన్ క్రియేట్ చేయడం ఈజీనే. కానీ ఈ పాయింట్ తో రెండు గంటలకు పైగా నిడివితో సినిమాను మలచడమే పెద్ద టాస్క్. ఇలాంటి డిజార్డర్ ఆధారంగా సినిమా తీసి మెప్పించాలంటే మారుతి తరహా చమత్కారం కావాలి. నాని.. శర్వానంద్ లాంటి మంచి నటులు కలవాలి. మిగతా ఆకర్షణలు కూడా తోడై ఒక మ్యాజిక్ జరగాలి. అప్పుడే ‘భలే భలే మగాడివోయ్’.. ‘మహానుభావుడు’ లాంటి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్లు తయారవుతాయి. లేదంటే ఔట్ పుట్‘రాజు గాడు’లాగా తయారవుతుంది.

హీరోకు ఒక డిజార్డర్ పెట్టి దాన్నుంచి వినోదం పుట్టించడంలో మారుతి గొప్ప టాలెంటే చూపించాడు. కానీ ఈ ఫార్మాట్లో అతను ముందుగా తీసిన ‘భలే భలే మగాడివోయ్’ కొత్తగా అనిపించి చక్కటి వినోదం పంచింది. కానీ అదే స్టయిల్లో తీసిన ‘మహానుభావుడు’ కూడా మెప్పించినప్పటికీ ఆ కథ ఎలా సాగుతుందో ముందే ఒక అంచనాకు వచ్చేస్తాం. కొంత మేర మొనాటనీ ఫీలింగ్ తెప్పిస్తుంది. ఒక కొత్త ఐడియాను మళ్లీ మళ్లీ ట్రై చేస్తే ఎలాంటి పీలింగొస్తుందో చెప్పడానికి అది ఒక ఉదాహరణ. ‘రాజుగాడు’ దగ్గరికొచ్చేసరికి ఈ ఫీలింగ్ మరింత పెరుగుతుంది. ఇందులోనూ హీరోకు ఒక డిజార్డర్ ఉంటుంది. ఆరంభ సన్నివేశాల్లో దాని చుట్టూ బాగానే వినోదం పండించారు. కానీ కాన్సెప్ట్ ఏంటో అర్థమైపోయాక కథనాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారా అని చూస్తే అక్కడి నుంచి తీవ్ర నిరాశ తప్పదు. ఏదో సీన్లు పేర్చుకుంటూ పోవడమే తప్ప తీరైన కథనం లేక ఆద్యంతం ‘రాజుగాడు’ ప్రయాణం ఒడుదొడుకులతోనే సాగుతుంది. ప్రథమార్ధం వరకైనా ఏదో ఓ మోస్తరుగా సాగిపోయే ‘రాజుగాడు’.. ద్వితీయార్ధం నుంచి తలాతోకా లేకుండా పేలవమైన సన్నివేశాలతో నడుస్తూ విసిగిస్తుంది.

తనకు తెలియకుండానే దొంగతనం చేసే డిజార్డర్ ఉన్న హీరో తన గోల్డ్ చైన్.. ఇతర వస్తువులు కొట్టేసి ఇంట్లో పెట్టుకుంటే అది చూసి నా వస్తువులు ఇంత భద్రంగా చూసుకున్నావా అని మురిసిపోతూ అతడికి ఐలవ్యూ చెబుతుంది హీరోయిన్. ఇది లవ్ స్టోరీ. మూగవాడైన విలన్ హీరో ఒక దొంగ అని చెప్పడానికి టీవీలో వస్తున్న ‘టక్కరిదొంగ’ సినిమా చూపిస్తాడు. కానీ పక్కనే ఉన్న అతడి అసిస్టెంటు హీరో తన పాకెట్లో డబ్బు పెట్టగానే హీరో మహేష్ బాబంత మంచోడని మావాడు చెబుతున్నాడంటాడు. ఇది కామెడీ. ఇక తాము పేల్చాల్సిన బాంబును హీరో కొట్టేశాడని తెలిసి అతడి కోసం తిరుగుతూ ఉగ్రవాదుల బ్యాచ్ పండించే విలనిజం ఉంటుంది చూడండి.. దాని గురించి వర్ణించతరం కాదు. ఇలా ఒక్కో రసం ఒక్కో విచిత్ర అనుభూతి కలిగిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ పుణ్యమా అని అక్కడక్కడా పేలిన కొన్ని కామెడీ పంచులు మినహాయిస్తే ‘రాజుగాడు’లో చెప్పుకోవడానికేమీ లేదు.

నటీనటులు:

రాజు పాత్రలో రాజ్ తరుణ్ సింపుల్ గా చేసుకుపోయాడు. అతడికేమంత సవాలు విసిరే పాత్ర కాదిది. కామెడీ బాగా అలవాటే కాబట్టి పెద్దగా కష్టపడలేదు. తన పాత్రతో ఉన్నంతలో వినోదం పండించే ప్రయత్నం చేశాడు. కానీ బలహీనమైన కథాకథనాల్ని కవర్ చేసే స్థాయి స్టామినా అతడికి లేకపోయింది. హీరోయిన్ అమైరా దస్తూర్ సినిమాకు ప్లస్ కాలేకపోయింది. అందం విషయంలో ఓకే అనిపించినా.. నటన విషయంలో ఆమె నిరాశ పరుస్తుంది. అమైరా హావభావాలు చిరాకు పెడతాయి. హీరో తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ సినిమాను కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఆయన అనుభవం ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. కామెడీ టైమింగ్ విషయంలో ఆయనకు తిరుగులేదనడానికి ఈ సినిమా మరో రుజువుగా నిలుస్తుంది. అలవోకగా వినోదం పండించారాయన. మిగతా వాళ్లలో రావు రమేష్.. నాగినీడు బాగా చేశారు. రావు రమేష్ పాత్రకు ఇంకొంచెం ప్రాధాన్యం కల్పించి ఉండాల్సింది. పూజిత పొన్నాడ.. సితార.. సిజ్జు.. ప్రవీణ్.. వీళ్లంతా ఓకే.

సాంకేతికవర్గం:

గోపీసుందర్ ఒకంట్రెండు పాటలతో ఆకట్టుకున్నాడు. కానీ అతడి క్లాస్ సంగీతం ఇలాంటి మాస్ కామెడీతో ముడిపడ్డ సినిమాలో సింక్ అవ్వలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. ఈ సినిమాకు అతడిలాంటి సంగీత దర్శకుడు అవసరం లేదనిపిస్తుంది. రాజశేఖర్ ఛాయాగ్రహణంలో ప్రత్యేకత ఏమీ లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ఇక దర్శకురాలు సంజనా రెడ్డి కామెడీ పండించడంలో అక్కడక్కడా పనితనం చూపించింది కానీ.. ఒక కథను పద్ధతిగా.. బిగువైన స్క్రీన్ ప్లేతో చెప్పడంలో ఆమె విఫలమైంది. స్క్రీన్ ప్లే చాలా కంగాళీగా తయారైంది. మూల కథను విస్తరించడంలో ఆమె పనితనం చూపించలేకపోయింది.

చివరగా: రాజు గాడు.. మనసు దోచలేకపోయాడు

రేటింగ్- 2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre