Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ : రాక్షసుడు

By:  Tupaki Desk   |   30 May 2015 5:29 AM GMT
సినిమా రివ్యూ :   రాక్షసుడు
X
రివ్యూ: రాక్షసుడు
రేటింగ్‌: 2.75 /5
తారాగణం: సూర్య, నయనతార, ప్రణీత, ప్రేమ్‌జీ అమరన్‌, పార్తిబన్‌, బ్రహ్మానందం, సముద్రఖని, శ్రీమాన్‌ తదితరులు
సంగీతం: యువన్‌ శంకర్‌రాజా
నిర్మాత: జ్ఞాన్‌వేల్‌ రాజా
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్‌ ప్రభు

సంగీత దర్శకుడు ఇళయరాజా ఫ్యామిలీ నుంచి వచ్చి డిఫరెంట్‌ మూవీస్‌తో తనకంటూ ఒక స్టైల్‌ను ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకొన్న దర్శకుడు వెంకట్‌ప్రభు. ఇతడి సినిమాల్లో నటించినవాళ్లే నటిస్తుంటారేమో కానీ.. కథ, కథనాల విషయంలో మాత్రం ఒకదానికి మరోదానికి పోలిక ఉండదు. ఒకసారి టచ్‌ చేసిన జోనర్‌ను మరోసారి ముట్టుకోకుండా ఇప్పుడు ఆరో సినిమాను తమిళ, తెలుగు ప్రేక్షకులకు చూపించాడు ఈ దర్శకుడు. ఈ సారి హీరో సూర్య కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. మరి ఈ అంచనాలను అందుకోవడంలో విజయవంతం అయ్యారా? డబ్బింగ్‌ సినిమానే అయినప్పటికీ స్ట్రైట్‌ సినిమాకు సమానమైన స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ సినిమా ఆకట్టుకొందా? అన్నది ఇపుడు తెలుసుకుందాం.

కథ:
మధుసూదన్‌ అలియస్‌ మాస్‌(సూర్య) ఒక చిల్లరదొంగ. అనాథగా తన స్నేహితుడు జెట్‌(ప్రేమ్‌జీ అమరన్‌)తో కలిసి పెరిగిన మాస్‌ జనాల్ని మోసం చేస్తూ బతికేస్తూ ఉంటాడు. మాలిని(నయనతార) అనే నర్సుతో ప్రేమలో పడ్డ మాస్‌ ఆమె కు డబ్బు అత్యవసరం అని ఒక దొంగతనం చేయబోయి ప్రమాదానికి గురి అవుతాడు. ఈ ప్రమాదంతో అతడికి ఆత్మలను చూసే ఒక అరుదైన శక్తి వస్తుంది. చనిపోయి.. కోరికలు తీరక ఆత్మలుగా సంచరిస్తున్న వారిని చూసే శక్తి వస్తుంది మాస్‌కు. ఆ విషయం అతడికి తెలుస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన ఆత్మలు అతడి వెంటపడతాయి. మొదట్లో భయపెట్టినా.. తర్వాత తమ కోరికలను తీర్చాలని, తమకు ఆత్మశాంతి కలిగించాలని ఆ దెయ్యాలు కోరతాయి. కన్నింగ్‌ ఫెలో అయిన మాస్‌ ఆ దెయ్యాలతో కొత్త గేమ్‌కు ప్లాన్‌ చేసి జనాలను భయపెడుతూ సొమ్ము చేసుకోవడం మొదలుపెడతాడు.

ఇలాంటి సమయంలో మాస్‌ను శివ(సూర్య-ద్విపాత్రాభినయం) అనే ఆత్మ పలకరిస్తుంది. తన కోరికలను కూడా తీర్చాలని కోరుతూ వెంటపడుతుంది. భారీగా డబ్బు సంపాదించుకొనే మార్గం చూపుతానంటూ మాస్‌ చేత ఒక హత్య కూడా చేయిస్తుంది శివ ఆత్మ. అయితే ఆ ఆత్మ తనను మోసం చేసి హత్య చేయించిందని గ్రహించిన మాస్‌ ఆ హత్యానేరం నుంచి ఎలా బయటపడ్డాడు? శివ ఆత్మకు మాస్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి అతీత శక్తితో హీరో ఎలాంటి ఇబ్బందిపడ్డాడు.. చివరకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.

కథనం:
ఒక మంచి వ్యక్తి హత్యకావింపబడతాడు. దెయ్యంగా మారి తనను హతం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి బతికి ఉన్న ఒక వ్యక్తి సహాయాన్ని తీసుకొంటాడు... ఈ కాన్సెప్ట్‌ను వింటే ఈ మధ్య కాలంలో వచ్చిన 'ముని' సినిమా పార్టు పార్టులుగా గుర్తుకురావొచ్చు! లారెన్స్‌ వరసగా మూడు సినిమాలు ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడు. మరి వెంకట్‌ ప్రభు ఈ ఎలా పడ్డాడో కానీ దాదాపు అలాంటి ట్రాప్‌లోనే పడ్డాడు. హారర్‌ బేస్డ్‌ థ్రిల్లర్‌కు మాస్‌ మసాలా కథాంశాన్ని జోడించి రాక్షసుడనే చొక్కా కుట్టాడు. అయితే దీనికి చాలా సొబగులు అద్దాడు. కథనాన్ని డిఫరెంట్‌గా ట్రీట్‌ చేశాడు. సూర్యలాంటి ఇమేజ్‌ ఉన్న హీరోని ఒక పాత్రలో సినిమా ఆసాంతం దెయ్యంగా చూపాలనుకోవడం పెద్ద సాహసం. ఆ సాహసం చేయడానికి తగిన గ్రౌండ్‌ వర్క్‌ చేసుకొనే ముందుకెళ్లాడు. దీంతో సినిమా ప్రేక్షకులకు ఒక డిఫరెంట్‌ ఫీలింగ్‌ని ఇస్తుంది.

కథలోకి ఆత్మల ఎంట్రీ దగ్గర నుంచి వెంకట్‌ప్రభులోని దర్శకత్వ ప్రతిభ.. చిత్రీకరణలో ఆయన చూపగల వైవిధ్యత కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. తనకు యాక్సిడెంట్‌ జరిగినప్పుడు ఆ ప్రమాదంలోనే తన స్నేహితుడు జెట్‌ చనిపోయాడని మాస్‌ తెలుసుకొనే సన్నివేశం ప్రేక్షకులకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది! అతడు ఆత్మగా మారి తనతో పాటు తిరుగుతున్నాడన్న ఎమోషనల్‌ కమ్‌ హారర్‌ సీన్‌ను చూపించిన విధానంతో దర్శకుడికి ఫుల్‌మార్క్స్‌ పడతాయి.

ఆత్మలతో కథను సీరియస్‌గా మార్చాకా మళ్లీ వాటితోనే కామెడీ చేయిస్తూ.. సినిమాను సరదాగా మార్చడంలో కూడా దర్శకుడు కృతార్థుడయ్యాడు. దెయ్యాలను అడ్డం పెట్టుకొని మాస్‌ వేసే ఎత్తులు కావాల్సినంత వినోదాన్ని పంచుతాయి. ఇదే సమయంలో శివ ఆత్మను ఎంట్రీ చేయించి.. ప్రేక్షకులకు కొత్త ఫజిల్‌ ఇచ్చి.. సినిమాలో ఆసక్తిని పెంచాడు. తన వెంట ఉన్న ఆత్మల్లో తన చేతిలో హతమైనవి కూడా ఉన్నాయని మాస్‌ గ్రహించే సన్నివేశం, శివ ఆత్మకు సంబంధించి సెకెండాఫ్‌లో వచ్చే ట్విస్టులు సినిమాకు 'బిగి'ని ఇచ్చాయి. అయితే కథ, కథనాలు ఎక్కడా లాజిక్‌కు అందవు. కేవలం డ్రామాను పండించడానికి అనుగుణంగా హీరోకు అతీంద్రీయ శక్తి అనే పాయింట్‌ను వాడుకొన్నారు కానీ.. లాజిక్‌లు లాగితే కథ తొలి సీన్‌ నుంచే పసలేనిదనిపిస్తుంది.

నటీనటులు:

చిత్రంలో ఆత్మలను, దెయ్యాలను ప్రెజెంట్‌ చేసిన స్టైల్‌ విషయంలో దర్శకుడు హాలీవుడ్‌ సినిమాలను ఫాలో అయిఉండవచ్చు. అయితే పాత్రధారులు మాత్రం ఆత్మల పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారు. ఎవరినీ పేర్లుపెట్టడానికేం లేదు. మాస్‌ లాంటి చిల్లరదొంగ పాత్రలు సూర్య ఇప్పటికే బొచ్చెడు చేశాడు. దెయ్యం పాత్ర మాత్రం అతడికి, ఈ సినిమాను చూసిన అతడి అభిమానులకు కచ్చితంగా కొత్త అనుభవాన్ని ఇస్తుంది. హీరోయిన్లు నయనతార, ప్రణీతలవి పరిమిత పాత్రలే. వారు ఆ పాత్రలను అలవోకగా చేసుకుపోయారు. ప్రేమ్‌జీ అమరన్‌కు ఈ సారి కేవలం కామెడీని మాత్రమే కాకుండా డ్రామాను పండించే అవకాశం కూడా దక్కింది తన అన్నయ్య సినిమాలో. దాన్ని అతడు సద్వినియోగం చేసుకొన్నాడు. పార్తిబన్‌ పోలీస్‌ పాత్రలో సీరియస్‌గానే కనిపిస్తూ నవ్వులు పండించాడు. సముద్రఖని అండ్‌ విలన్ల బ్యాచ్‌ ఓకే. తెలుగు టచ్‌ కోసం బ్రహ్మానందాన్ని రెండు మూడు సీన్లలో చూపించారు. .

సాంకేతిక వర్గం:

తన ఆరో సినిమాతో ఆరో డిఫరెంట్‌ జోనర్‌ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు కానీ.. సినిమాను సాగదీయకుండా ముగించడంలో ఫెయిలయ్యాడు. ట్విస్టులతో కూడిన కథనమే అయినప్పటికీ దాదాపు మూడు గంటలసేపు సినిమా ఇది. లెంగ్త్‌ తగ్గించడం కోసం ఒక పాటను కట్‌ చేసినట్టుగా కూడా ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ఎండింగ్‌లో టైటిల్‌ కార్డ్స్‌ పడేటప్పుడు ఆ పాటను ప్రదర్శించి చూస్తే చూడండి లేకపోతే పొండి అన్నట్టుగా వ్యవహరించారు. ఇలా చేసేబదులు సినిమాను ట్రిమ్‌ చేసుకొని ఉంటే చాలా బాగుండేది. యువన్‌శంకర్‌ రాజా ఇతరుల సినిమాలకు ఏమో కానీ వెంకట్‌ప్రభు సినిమాలకు మాత్రం గొప్ప ఔట్‌పుట్‌ని ఇస్తాడు. ఈ సారి కూడా అతడు తన తీరును కొనసాగించాడు. హారర్‌ కథాంశానికి తగ్గట్టుగా కెమెరావర్క్‌ కూడా బాగుంది.

చివరిగా...

రాక్షసుడు భయపెడతాడు, నవ్విస్తాడు కానీ కొద్దిగా బోర్‌ కూడా కొట్టిస్తాడు!