Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'రాక్షసుడు'

By:  Tupaki Desk   |   2 Aug 2019 7:33 AM GMT
మూవీ రివ్యూ : రాక్షసుడు
X
చిత్రం : 'రాక్షసుడు'

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ - అనుపమ పరమేశ్వరన్ - శరవణన్ - రాజీవ్ కనకాల - బేబీ దువా - కాశీ విశ్వనాథ్ - రవి - కౌశిక్ వినోదిని తదితరులు
సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: వెంకట్.సి.దిలీప్
మాటలు: సాగర్
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
కథ - స్క్రీన్ ప్లే: రామ్ కుమార్
దర్శకత్వం: రమేష్ వర్మ

కెరీర్ ఆరంభం నుంచి మాస్ మసాలా సినిమాలతోనే సాగిపోతూ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ మధ్య కొంచెం భిన్నమైనన దారిలో నడుస్తున్నాడు. కొన్ని నెలల కిందటే ‘సీత’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో పలకరించిన అతను.. ఇప్పుడు ‘రాక్షసుడు’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళంలో హిట్టయిన ‘రాక్షసన్’కు రీమేక్‌ గా తెరకెక్కిన ఈ చిత్రమైనా శ్రీనివాస్ సక్సెస్ కరవు తీర్చేలా ఉందేమో చూద్దాం పదండి.

కథ:

అరుణ్ (బెల్లంకొండ శ్రీనివాస్) తాను రాసుకున్న సైకో కిల్లర్ స్క్రిప్టును పట్టుకుని దర్శకుడు కావాలన్న ఆశతో నిర్మాతల చుట్టూ తిరుగుతుంటాడు. కానీ అతడి కోరిక ఫలించదు. ఆపై ఇంట్లో వాళ్ల బలవంతం మేరకు అతను పోలీస్ అవుతాడు. ఐతే ఎస్ ఐగా చేరిన అరుణ్ ముందుకు ఒక సవాలు విసిరే కేసు వస్తుంది. ఒక సైకో కిల్లర్ వరుసగా స్కూల్లో చదివే టీనేజీ అమ్మాయిల్ని లక్ష్యంగా చేసుకుని వారిని దారుణంగా హతమారుస్తుంటాడు. మొదట అంతు చిక్కని విధంగా ఉన్న ఈ కేసులో అరుణ్ నెమ్మదిగా క్లూస్ సేకరించి సైకో కిల్లర్ జాడ కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ కేసు రాను రాను మరింత సంక్లిష్టమవుతుంది. సైకో కిల్లర్ కారణంగా వ్యక్తిగతం గానూ నష్టపోయిన అరుణ్ చివరికి ఈ కేసును ఎలా ఛేదించాడు.. ఇంతకీ ఎవరా కిల్లర్.. అతడి గతమేంటి? అన్నది తెరమీదే చూడాలి.

కథనం - విశ్లేషణ:

ట్రూత్ ఫుల్ టు ద ఒరిజినల్.. రీమేక్ సినిమా దాదాపుగా మాతృకను ఫాలో అయినపుడు ఈ మాట వాడుతుంటారు. తెలుగు సినిమాల రీమేక్ చరిత్రలో ఈ మాటకు నూటికి నూరు శాతం న్యాయం చేసిన చిత్రాల్లో ‘రాక్షసుడు’ ఒకటిగా నిలుస్తుంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్.. షాట్ టు షాట్.. మాతృక ‘రాక్షసన్’ను ఫాలో అయిపోయిన సినిమా ఇది. మాతృక నుంచి ఒక్క అంగుళం కూడా పక్కకు వెళ్లడానికి ఇష్టపడని ‘రాక్షసుడు’ టీం టైటిల్ మాత్రమే కాదు.. హీరో పాత్ర పేరును కూడా ఒరిజినల్ నుంచే తీసుకుంది. అంతే కాదు మాతృకలోని కొన్ని సీన్లను యథాతథంగా వాడేసుకున్నారు కూడా. దర్శకుడు రమేష్ వర్మ దాదాపుగా ఒక జిరాక్స్ కాపీ తీసి పెట్టేశాడని చెప్పొచ్చు. అందుకేనేమో కథ మాత్రమే కాదు.. స్క్రీన్ ప్లే క్రెడిట్ సైతం ఒరిజినల్ డైరెక్టర్ రామ్ కుమార్ కే ఇచ్చేశాడు. కాబట్టి తెలుగు వెర్షన్ లో మార్పులు చేర్పుల గురించి మాట్లాడుకునే అవసరమే లేదు. పోలికల గురించి కూడా చర్చే లేదు. ఇదొక రీమేక్ అన్న సంగతి పక్కన పెట్టి మామూలుగా చూస్తే.. థ్రిల్లర్ ప్రియులను మెప్పించే చిత్రమిది. సైకో కిల్లర్ కథలతో ‘రాక్షసుడు’కు కొంచెం సారూప్యతలు ఉన్నప్పటికీ.. ప్రేక్షకుల్ని ఆద్యంతం గెస్సింగ్ లో ఉంచే సస్పెన్స్ ఎలిమెంట్.. మలుపులు.. బిగువైన స్క్రీన్ ప్లే ‘రాక్షసుడు’ను ఎంగేజింగ్ గా మార్చాయి.

సస్పెన్స్ థ్రిల్లర్లలో ఉండాల్సిన ప్రధాన లక్షణం.. వాట్ నెక్స్ట్ అని ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించడం. ఈ విషయంలో ‘రాక్షసుడు’ సక్సెస్ అయింది. ఇందులో స్క్రీన్ ప్లేది కీలక పాత్ర. ప్రథమార్ధంలో అమ్మాయిలు ఒక్కొక్కరే అదృశ్యం కావడం.. హత్యకు గురవడం వరకు రొటీన్ గానే అనిపిస్తుంది. ఒక మామూలు థ్రిల్లర్ సినిమానే చూస్తున్న భావన కలుగుతుంది. కానీ ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరనే విషయాన్ని విషయాన్ని రివీల్ చేయడానికి ముందు వచ్చే మలుపులు మాత్రం ఉత్కంఠ రేకెత్తిస్తాయి. స్కూల్ టీచర్ పాత్రతో పోలీసులతో పాటు ప్రేక్షకుల్ని కూడా పక్కదోవ పట్టించి.. ఆ తర్వాత కథను మలుపు తిప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు ఏదో అనుకుంటే ఇంటర్వెల్ ముంగిట దానికి భిన్నమైన ట్విస్ట్ రావడంతో ద్వితీయార్ధం మీద ఆసక్తి పెరుగుతుంది. రెండో అర్ధంలో కథ మరిన్ని మలుపులు తిరుగుతూ.. స్క్రీన్ ప్లే మరింత బిగువుగా మారి ‘రాక్షసుడు’ ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్ ఇస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంత కృత్రిమంగా అనిపించినప్పటికీ అందులోని కొన్ని దృశ్యాలు.. ఆ తర్వాత కథలోని మేజర్ ట్విస్ట్ ఒళ్లు జిల్లుమనేలా చేస్తాయి.

ఐతే థ్రిల్లర్ సినిమాలకు నిడివి విషయంలో కొంత నియంత్రణ అవసరం. ఒకే ఒక పాట ఉన్న సినిమా రెండున్నర గంటలు సాగితే ఇబ్బందే. కథ నుంచి పెద్దగా డీవియేషన్ లేకపోయినా.. దాదాపుగా అన్ని సన్నివేశాలూ కథకు అవసరమైనవే అయినప్పటికీ.. చివరికి సినిమా అయ్యేసరికి ‘లెంగ్తీ’ అనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సన్నివేశాల్లో సాగతీత బిగిని దెబ్బ తీసింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగున్నట్లే అనిపిస్తుంది కానీ.. అది సహజంగా లేదు. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ లెంగ్తీగా అనిపిస్తాయి. ఇక కథాంశం.. నడత పరంగా చూస్తే థ్రిల్లర్ ప్రియులు మినహా వారికి ‘రాక్షసుడు’ రుచించడం కష్టం. కొన్ని జీర్ణించుకోలేని విషయాలు కూడా సినిమా పరిధిని తగ్గించేవే. ఇదొక రీమేక్ అనే ఫీలింగ్ వల్ల కూడా ‘రాక్షసుడు’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చూడాాలి. ఒరిజినల్ చూసిన వాళ్లకైతే ఇది కొత్తగా ఆఫర్ చేసేదేమీ లేదు. మాతృకను మెరుగుపరచడమంటూ ఏమీ జరగలేదు. కాబట్టి దానికంటే బెటర్ ఫీలింగ్ అయితే ఇది ఇవ్వదు. కొన్ని ప్రతికూలతలున్నప్పటికీ థ్రిల్లర్ జానర్ ప్రియుల్ని మాత్రం ‘రాక్షసుడు’ మెప్పిస్తుంది.

నటీనటులు:

బెల్లంకొండ శ్రీనివాస్ తనకు అలవాటైన రీతిలో కాకుండా.. ఏ బిల్డప్ లేకుండా చాలా మామూలుగా నటించాడు. పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు. ఐతే డైలాగ్ డెలివరీలో - హావభావాలు పలికించడంలో మొదట్నుంచి ఉన్న కొన్ని బలహీనతల వల్ల శ్రీనివాస్ అక్కడక్కడా కొంచెం ఇబ్బంది పడ్డాడు కానీ.. ఉన్నంతలో బాగానే చేశాడు. అతడిపై ఉన్న నెగెటివిటీ కొంత వరకు ఈ సినిమా తగ్గిస్తుంది. తన మేనకోడలిని దిగ్భ్రాంతికర రీతిలో చూసినపుడు శ్రీనివాస్ హావభావలు బాగున్నాయి. పోలీస్ పాత్రకు శ్రీనివాస్ బాగా ఫిట్ అయ్యాడు. అనుపమ పరమేశ్వరన్ ది చాలా పరిమితులున్న పాత్ర. ఉన్నంతలో బాగా చేసింది కానీ.. మంచి నటి అయిన ఆమెకు పెద్దగా స్కోప్ లేకపోవడం అభిమానుల్ని నిరాశ పరుస్తుంది. రాజీవ్ కనకాల ఒక సీన్లో అద్భుతంగా చేశాడు. లేడీ పోలీసాఫీసర్ పాత్రలో చేసిన నటి ఆకట్టుకుంది. విలన్ పాత్ర ధారి పూర్తిగా మేకప్ లో మునిగిపోయాడు కాబట్టి ఎలా చేశాడని చెప్పడం కష్టం. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతికవర్గం:

‘రాక్షసుడు’ సినిమాకు స్క్రిప్టు తర్వాత అతి పెద్ద బలం.. జిబ్రాన్ నేపథ్య సంగీతమే. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఇప్పటికే చాలా సినిమాల్లో తనదైన ముద్ర వేసిన జిబ్రాన్.. ఈ సైకో థ్రిల్లర్ మూవీలో టాప్ క్లాస్ ఔట్ పుట్ తో శభాష్ అనిపించుకున్నాడు. పియానో థీమ్ తో సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ ను నడిపించిన తీరు సినిమాలో మేజర్ హైలైట్. ఆ సౌండ్స్ కొన్ని చోట్ల ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. థియేటర్ నుంచి వచ్చాక కూడా వెంటాడుతాయి. చాలా సన్నివేశాల్ని బ్యాగ్రౌండ్ స్కోర్‌ తో ఎలివేట్ చేశాడతను. వెంకట్ సి.దిలీప్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. అతను దాదాపుగా ఒరిజినల్ నే ఫాలో అయినట్లున్నాడు. థ్రిల్లర్ సినిమాలకు తగ్గ మూడ్ క్రియేట్ చేయడంలో కెమెరా కీలక పాత్ర పోషించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ సంభాషణలు మామూలే. తమిళ డైలాగుల్ని తర్జుమా చేసినట్లున్నాడు. ప్రత్యేకంగా చెప్పుకునే డైలాగులేమీ లేవు. దర్శకుడు రమేష్ వర్మ సెట్లో ‘రాక్షసన్’ సినిమా ఒక పక్క ప్లే చేస్తూ ఇంకో పక్క షూటింగ్ చేశాడేమో అనిపించేలా ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశాడు. దర్శకుడిగా అతడి పనితనం గురించి మాట్లాడేదేమీ లేదు. కాకపోతే మాతృకను చెడగొట్టకుండా తన బాధ్యతను నిర్వర్తించాడు.

చివరగా: రాక్షసుడు.. థ్రిల్ చేస్తాడు

రేటింగ్-2.75/5



Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre