Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల్లోకి ర‌మ్మ‌ని క్లాస్ తీస్కుంది!

By:  Tupaki Desk   |   27 May 2019 4:55 AM GMT
రాజ‌కీయాల్లోకి ర‌మ్మ‌ని క్లాస్ తీస్కుంది!
X
డాక్ట‌ర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ పూర్తి చేయాలి. ఇంజినీర్ అవ్వాలంటే ఇంజినీరింగ్ చేయాలి. మ‌రి దేశ‌భ‌విష్య‌త్ ని నిర్ధేశించే.. ప్ర‌జా జీవితాల్ని క్ష‌ణ‌క్ష‌ణం ప్ర‌భావితం చేసే రాజ‌కీయాల్లోకి వెళ్లాలంటే ఎలాంటి కోర్సులు ఉండ‌వా? ఇదే విష‌యాన్ని ప్ర‌శ్నించారు న‌వ‌త‌రం క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్. సూర్య‌- ర‌కుల్- సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో సెల్వ రాఘ‌వ‌న్ తెర‌కెక్కించిన ఎన్ జీకే (నంద గోపాల కృష్ణ‌) చిత్రం ఈ నెల 31న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఈ సినిమా క‌థాంశం గురించి.. ఇందులో త‌న రోల్ గురించి చెబుతూ ర‌కుల్ `రాజ‌కీయాలు` అన్న టాపిక్ ని ట‌చ్ చేశారు.

హైద‌రాబాద్ లో మీడియా స‌మావేశంలో ర‌కుల్ మాట్లాడుతూ..``ప్ర‌స్తుతం ఎక్క‌డ విన్నా రాజ‌కీయాల గురించే మాట్లాడుతున్నారు. యువ‌త‌రంలో ఎక్కువ డిబేట్ ర‌న్ అవుతోంది. అయితే రాజ‌కీయాల్లోకి విద్యావంతులు రావ‌డం వ‌ల్ల స‌మూల‌మైన మార్పు సాధ్య‌మ‌వుతుంద‌ని నేను భావిస్తున్నాను. ఎంబీబీఎస్.. ఇంజినీరింగ్ లాగే రాజ‌కీయాల‌కు ఒక కోర్స్ ఉండాల‌ని భావిస్తున్నా. మంచి రాజ‌కీయ నాయ‌కుడు ఎలా ఉండాలి? అన్న‌ది యూత్ ఆలోచించాలి. చ‌దువుకున్న యువ‌కులు రాజ‌కీయాల్లోకి వ‌స్తే అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి`` అని అన్నారు.

ఎన్జీకే చిత్రం ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్. ఒక సామాన్యుడు రాజ‌కీయాల్లోకి రావాలంటే ఎలాంటి స‌హ‌సాలు చేయాలి? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు? అన్న‌దే ఈ సినిమా ఇతివృత్తం. సూర్య నంద గోపాల కృష్ణ పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. సాయి ప‌ల్ల‌వి అత‌డి భార్య పాత్ర‌లో న‌టించారు. నేను రాజ‌కీయాల‌కు స‌పోర్టుగా నిలిచే ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాన‌ని ర‌కుల్ తెలిపారు. 2019 ఎన్నిక‌ల స‌ర‌ళి గురించి ప్ర‌స్థావించిన ర‌కుల్ .. ఈసారి ఎన్నికలలో ఓటింగ్‌ శాతం కూడా పెరిగింది. అది మంచి పరిణామం. రాజకీయాలపై సరైన అవగాహన - సమాజం పట్ల బాధ్యత యువతరానికి చాలా అవసరం. ఇవి రెండూ ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి వస్తే.. దేశంలోని సమస్యలు తొలగిపోతాయి అని అన్నారు. ఎన్జీకే చిత్రంలో ర‌కుల్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టించార‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. హీరో సూర్య‌పై క‌త్తితో ఎటాక్ చేసే కార్పొరెట్ గాళ్ పాత్ర‌లో ర‌కుల్ క‌నిపిస్తోంది. రాజ‌కీయ నాయ‌కుల‌కు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసే కార్పొరెట్ గుర‌కూ త‌ర‌హా పాత్ర‌లో ర‌కుల్ న‌టించ‌డం ఆస‌క్తిక‌రం. అన్న‌ట్టు ర‌కుల్ న‌టించిన ఆరు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. ఆ సంగ‌తిని త‌నే స్వ‌యంగా రివీల్ చేశారు.